సిరుల వేణి సింగరేణి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై పోరుకు సిద్ధమంటూ మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లేవనెత్తిన అంశంపై స్పందించిన ఆయన, అవసరమైతే కార్మికులు, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని కేంద్రం కుట్రను భగ్నం చేస్తామని ప్రకటించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని విస్మరించిన పీఎంకు తగిన గుణపాఠం తప్పదంటూ హెచ్చరించారు. ఇక బొగ్గు గనుల ప్రైవేటీకరణను అడ్డుకోవడం ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కే సాధ్యమని, ఆ పార్టీ వెంటే నడుస్తామని కార్మికులంతా చెబుతున్నారు.
సింగరేణి బొగ్గు గనుల విషయమై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలు రాశారు. నాలుగు బొగ్గు గనులు తమకే ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. కానీ నాలుగు బొగ్గు గనులు వేలం వేస్తున్నాం. అందులో సింగరేణి కూడా పాల్గొనవచ్చని కేంద్రం చెప్పింది. సింగరేణి కార్మికులందరికీ మాటిస్తున్నాం. అవసరమైతే ఎంత దూరమైనా పోతాం. సింగరేణిని ప్రైవేట్‌పరం చేయాలన్న కేంద్రం కుట్రను భగ్నం చేస్తాం. కార్మికులు, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమిస్తాం. ఇది అసెంబ్లీలో విప్ బాల్క సుమన్ ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందన.
మన రాష్ట్రంలో సింగరేణి ప్రముఖమైన సంస్థ. నాలుగు బొగ్గు బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఈ కుట్ర నుంచి సింగరేణిని కాపాడడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. ఇదీ సింగరేణి కార్మికుల పక్షాన చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ను అడిగిన ప్రశ్న..
మంచిర్యాల, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉత్తర తెలంగాణ జిల్లాల జీవనాడి.. సిరుల తల్లి సింగరేణి మనుగడనే ప్రశ్నార్థకంగా చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై పోరుకు సిద్ధమని అ సెంబ్లీ సాక్షిగా మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వేలం పేరిట బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని తీ వ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక లోకానికి ఆయన కొండంత అండగా నిలిచారు. ప్రైవేటీకరణకు వ్య తిరేకంగా కార్మికులు, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. దీ నిపై సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. సింగరేణి కార్మికుల కష్టాలు బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు మాత్రమే తెలుసంటున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే తమ బతుకులు బాగుపడ్డాయని, ఇప్పుడు ప్రైవేటీకరణను అడ్డుకోవడం కూ డా బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని జో ష్యం చెబుతున్నారు.
బొగ్గు రంగం నుంచి బ్యాంకింగ్ రంగం వరకు, ఎయిరిండియా నుంచి ఎల్ఐసీ వరకు అన్ని పరిశ్రమలను ప్రైవేట్‌కు కట్టబెట్టడమే ధ్యేయంగా మో దీ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశానికి అత్యంత కీలకమైన బొగ్గురంగాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 500 బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్‌పరం చేసి రూ.1.75 లక్షల కోట్లు కొల్లగొట్టాలనేది ఆయన లక్ష్యం. ఆ ధన దాహం తీర్చుకునే క్రమంలోనే బొగ్గు గను ల అభివృద్ధి నియంత్రణ చట్టం-1957ను రద్దు చేసి కోల్‌మైన్స్ ప్రొవిజన్ యాక్ట్-2015ను అమల్లోకి తెచ్చారు. దీని ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవే ట్ వ్యక్తులు సైతం బొగ్గు గనుల వేలంలోపాల్గొనేందుకు అవకాశం కల్పించారు. అలా 2016-17 నుంచి ఇప్పటి వరకు 32 బొగ్గు గనులను వేలం ద్వారా వివిధ కంపెనీలకు కట్టబెట్టారు. తాజాగా మరికొన్ని బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సింగరేణి సంస్థ రూ.150 కోట్లు నష్టపోనున్నది. మైనింగ్ మొదలుపెట్టడానికి ముందు ఎక్కడెక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నా యో తెలుసుకునేందుకు (సైట్ స్పెసిపిక్) చేస్తారు. ఇలా సింగరేణి సంస్థ ఇల్లందు డివిజన్లోని కో యగూడెం, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్, మందమర్రి డి విజన్‌లో కాసిపేట, కాసిపేట-2 ఓపెన్ కాస్ట్‌లతో బొగ్గు నిక్షేపాలను గుర్తించింది. ల్యాండ్ సర్వే, వి ద్యుత్ లేన్ల ఏర్పాటుకు దాదాపు రూ.150 కోట్లు ఖర్చు పెట్టింది. తీరా ఇప్పుడు వాటిని సింగరేణి తవ్వుకోడానికి వీలులేదు. అందరితో వేలంలో పా ల్గొనాలని కేంద్ర చెబుతున్నది. ఒక పబ్లిక్ సెక్టార్ పెట్టుబడిదారులతో పోటీ పడాలంటే వేలంలో అధిక మొత్తానికి బొగ్గు బ్లాక్‌లను దక్కించుకోవాల్సి ఉంటుంది. అలా చేయ డం ద్వారా సంస్థపై భారం పడి పెట్టుబడిని తగ్గించుకునే క్రమంలో కార్మికులను తీసేయడం లేదా కార్మికులకు ఇస్తున్న ప్రయోజనాలను విరమించుకోవడం చేయాల్సి వ స్తుంది. లేదా సంస్థ క్రమంగా నష్టాల్లోకి పోయే ప్రమాదం పొంచి ఉంది. ఆ తర్వాత నష్టాల పేరు తో సింగరేణిని ప్రైవేటుపరం చేస్తే పరిస్థితి ఏంటనేది కార్మికులకు అగమ్యగోచరంగా మారింది.
తెలంగాణ వచ్చాకే సింగరేణి కార్మికుల బతుకు లు బాగుపడ్డాయి. లాభాల్లో వారికి ఇచ్చే వాటా పెరిగింది. ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తున్నది. అంతేగాక గత ప్రభుత్వాలు రద్దు చేసిన కారుణ్య నియామకాలను సీఎం కేసీఆర్ పునరుద్ధరించారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చి సంస్థలో కార్మిక వర్గాన్ని మరింత బలోపేతం చేశారు. సింగరేణి కార్మికులతో పాటు వారి తల్లిదండ్రులకు ఉచిత కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే దారుణమైన పరిస్థితుల్లో ఉన్న సింగరేణి సంస్థకు కొత్త జీవం తీసుకువచ్చారు. కేంద్ర ప్రైవేటీకరణ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గతంలో బీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఏడాది క్రితం ఫిబ్రవరి 9న మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక రోజు నిరహార దీక్ష సైతం చేశారు. ఇవాళ సరిగ్గా ఏడాది తర్వాత సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలను భగ్నం చేసేందుకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
కేంద్రంలోని మోదీ సర్కారు సింగరేణిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నది. ఇప్పటికే కేసీఆర్ బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని ప్రధానమంత్రి మోదీకి లేఖ కూడా రాశారు. అయినప్పటికీ కేంద్ర సర్కారు టెండర్లు పిలిచి తన అనుయాయులకు అప్పగించాలని చూస్తున్నది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం కూడా అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ క్షుణ్ణంగా వివరించారు. కేంద్ర సర్కారు తీసుకుంటున్న చర్యలపై దుమ్మెత్తిపోశారు. తాజాగా గురువారం కూడా శాసనసభలో మళ్లీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సింగరేణి అంశాన్ని లేవనెత్తగా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగానే గనులను వేలం వేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. గనులను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్‌పరం కానివ్వబోమని, గుజరాత్లో నామినేషన్ పద్ధతిలో గనులు కోలిండియాకు అప్పగించారు. అదే పద్ధతి సింగరేణిలో అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సుమన్, కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా.
– రాళ్లబండి రాజన్న, డిప్యూటీ సూపరింటెండెంట్, జీఎం ఆఫీస్, శ్రీరాంపూర్