మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 29: అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని రెవెన్యూ సెక్షన్లో పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్ వర్కర్ ఇర్ఫాన్ ఇంటి నంబర్లు ఇప్పిస్తానని చెప్పి ముగ్గురు వ్యక్తుల వద్ద రూ. 15 వేల చొప్పున మొత్తం రూ. 45 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అలాగే టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఫక్రూఅలీ అనే అటెండర్ ఇంటి అనుమతులు ఇప్పిస్తానని ఒకరి వద్ద రూ. 25 వేలు, మరొకరి దగ్గర రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదుల అందాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
రాంనగర్‌లోని అమరవేణ రమేశ్‌యాదవ్ దగ్గర రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని మున్సిపల్ అటెండర్ ఫక్రూఅలీ తెలిపారు. ఈ మేరకు ఇంటి యజమాని అమరవేణి ఐలయ్యను గురువారం మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చి చైర్మన్‌కు, కమిషనర్‌కు కలిపించాడు. తాను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని, తన ఇంటిపై కొడుకుకు ఎలాంటి అధికారం లేదని అన్నారు.