మంచిర్యాలటౌన్, మే 31: టాక్స్ రివైజ్ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య కోరారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పన్నుల రివైజేషన్ కోసం మున్సిపల్ సిబ్బంది వార్డుల్లో తిరుగుతూ ఇండ్లు కొలుస్తున్నారని, కొందరు రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్గా వాడుతున్నారని, మరికొందరు పై అంతస్తులు నిర్మించుకున్నారని, ఇలాంటి వాటిని గుర్తించి టాక్స్ వేయడం జరుగుతుందన్నారు.
గతంలో కొందరు తక్కువ స్థలాన్ని చూపి పన్నులు తక్కువగా వేయించారని, అలాంటివారుంటే మున్సిపల్ సిబ్బందిని పిలిపించుకుని సరైన కొలతలు చేయించుకోవాలన్నారు. ట్యాక్స్ తక్కువ వేయిస్తామని చెప్పే దళారులను నమ్మవద్దని, ఎరవరకీ లంచం ఇవ్వవద్దని కోరారు. గతంలో ఆరోపణలు వచ్చిన మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొత్తగా నల్లా కనెక్షన్లు ఇస్తున్నామని, కొన్ని ఇండ్లలో ఎక్కువ పోర్షన్లు ఉంటే వారికి రెండు, మూడు కనెక్షన్లు కూ డా ఇస్తామని, ప్రతి ఇంటికీ సురక్షిత నీరు ఇవ్వడమే త మ లక్ష్యమని చెప్పారు.
ఎండల కారణంగా బోర్లలో నీ టి మట్టం తగ్గిందని, ఎమ్మెల్యే పీఎస్సార్ ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతిరోజూ తాగునీరు ఇవ్వాలని అధికారుల ను ఆదేశించారని చెప్పారు. పట్టణంలో దాదాపు 90 శాతం ఏరియాల్లో నీరు వస్తుందని, కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు, చిన్నచిన్నకారణాలతో నీరు అం దడం లేదని, పదిరోజుల్లో వానలు వస్తాయని, ఇబ్బందులు ఉండవని అన్నారు. నల్లాలకు మోటార్లను పెట్టవద్దని సూచించారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవచ్చునని అన్నారు.