బోథ్, అక్టోబర్ 7 : బోథ్ మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదామని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీపీ అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా చూడాలన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు వర్తించేలా దృష్టి సారించాలని సూచించారు. అంతకుముందు శాఖల వారీగా సమీక్షించారు. వ్యవసాయాధికారి వెండి విశ్వామిత్ర మాట్లాడుతూ మండల పరిధిలో 13069మంది రైతులకు రైతుబంధు పథకం కింద రూ.21.32 కోట్లు ఖాతాల్లో జమ చేశామన్నారు.
ఏడాది కాలంలో రైతు బీమా కింద 68 మంది రైతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున మంజూరు కాగా 66 మంది ఖాతాల్లో జమ చేశారన్నారు. బోథ్ ప్రభుత్వ దవాఖాన వద్ద మిషన్ భగీరథ కింద అందిస్తున్న నీటి సరఫరా పైపు లీకేజీల మూలంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని జడ్పీటీసీ సంధ్యారాణి సభ దృష్టికి తీసుకువచ్చారు. లీకేజీలను నివారించేలా చూస్తామని ఏఈఈ కళ్యాణ్ వివరించారు. అటవీ, రెవెన్యూ, వైద్యారోగ్య, విద్యుత్, ఐసీడీఎస్, పశువైద్య, తదితర శాఖల అధికారులు నివేదికలు చదివి వినిపించారు. సమావేశంలో బోథ్ సహకార సంఘం చైర్మన్ కదం ప్రశాంత్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, ఎంపీడీవో అబ్దుల్ సమద్, ఎంపీవో జీవన్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్ ప్రకాశ్, ఏఈఈలు జనార్దన్‌రెడ్డి, నర్సింగ్, ఎఫ్ఎస్వో సుందర్, ఏపీవో జగ్దేరావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.