Chenab dam : పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం భారత్కు చాలా మేలు చేసింది. ఇండియా ఎప్పటినుంచో నిర్మించాలని భావిస్తున్న భారీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను భారత్ ప్రారంభించింది. ఇండియా-పాకిస్తాన్ మధ్య సరిహద్దున ఉన్న సింధు నదీ జలాలకు సంబంధించి ఒప్పందం ఉంది.
1960ల నాటి ఒప్పందం ప్రకారం.. తూర్పు వైపున ఉన్న రవి, బియాస్, సట్లేజ్ నదుల్ని ఇండియా వాడుకుంటే.. పశ్చిమ వైపు ఉన్న సింధు, జెలూమ్, చీనాబ్ నదులపై పాక్ ఆధిపత్యం ఉంటుంది. పశ్చిమ నదులకు సంబంధించిన నీటిలో తక్కువ శాతమే ఇండియా వాడుకునేది. ఎక్కువ శాతం పాకిస్తాన్కు వదిలేసేది. దీంతో పాక్ ప్రయోజనం పొందింది. ఇదే సమయంలో జమ్మూ-కాశ్మీర్, రాంబన్ జిల్లాలోని చీనాబ్ నదిపై నిర్మించ తలపెట్టిన సావల్కోట్ మెగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు పాక్ వైపు నుంచి అభ్యంతరాలున్నాయి. ఇక్కడ నదీ జలాల విషయంలో ఉన్న ఒప్పందం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుగా మారింది. అయితే, గత ఏడాది జమ్మూ-కాశ్మీర్, పహల్గాంపై పాక్ ఉగ్రవాదులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకుంది. దీంతో పాక్కు నీరు నిలిచిపోయింది. ఈ అంశం భారత్కు కలిసొచ్చింది. పాక్తో ఒప్పందం లేదు కాబట్టి.. ఇకపై ఇక్కడి ప్రాజెక్టును స్వేచ్ఛగా మొదలుపెట్టొచ్చు. అందుకే ఇండియా ఇప్పుడు సావల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. వేగవంతంగా దీన్ని పూర్తి చేయాలని భావిస్తోంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) సంస్థ రూ.5,129 కోట్లతో టెండరుకు నోటిఫికేషన్ దాఖలు చేసింది. మార్చి 12 నుంచి 20 వరకు సంస్థలు బిడ్లు దాఖలు చేయొచ్చు. 180 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్రాజెక్టును బిడ్ దక్కించుకున్న 3,825 రోజులలోపు పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టు పూర్తైతే 1,856 మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా జమ్మూ-కాశ్మీర్ ప్రాంతానికి విద్యుత్ సరఫరా సమస్య తీరిపోతుంది. అంతేకాదు.. ఈ ప్రాంతంలోనివారికి ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయని ప్రభుత్వం చెబుతోంది.