కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై శనివారం నిర్వహించిన ‘దిశ’ సమావేశం సమస్యలకు పరిష్కారం చూపకుండానే ముగిసింది. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబుతో కలిసి మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 గంటల దాకా సమీక్ష నిర్వహించగా, అటవీ శాఖ అనుమతులు లేక నిలిచిపోయిన రోడ్లు, సెల్ సిగ్నల్స్ లేక ఆసరా పింఛన్‌దారులు పడుతున్న ఇబ్బందులు, అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీలవంటి అనేక సమస్యలను అధికారులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.
ఆయన వాటి పరిష్కారం కోసం ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెళ్లిపోయారు. జిల్లాలో అటవీ శాఖ అనుమతులు లేక 33 వంతెనలు, 31 రోడ్లు నిలిచిపోయినట్లు అధికారులు ఎంపీకి తెలిపారు. మరో 9 రోడ్ల నిర్మాణానికి కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతి వచ్చిందని, రూ. 12 కోట్లు అటవీ శాఖకు చెల్లించి ఈ పనులు చేపట్టాల్సి ఉంటుందని, ఈ నిధులు కూడా చెల్లించకపోవడంతో అనుమతులు వచ్చిన రోడ్లను సైతం నిర్మించలేకపోతున్నామని ఆర్అండ్బీ అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు. అలాగే పీఎంజీఎస్‌వై కింద వచ్చిన 13రోడ్ల నిర్మాణాలకు కూడా క్లియరెన్స్ లేదని అధికారులు ఎంపీకి చెప్పారు. జిల్లాలోని 75 అంగన్వాడీకేంద్రాలకు పక్కా భవనాలు లేవని, 98 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 271 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. పక్కా భవనాల నిర్మాణాలకు స్థలం సమస్య ఎదురవుతుందని అధికారులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.
గిరిపోషణ్ అభియాన్ పథకాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో సెల్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తిర్యాణి మండలం మంగి, మానిక్యాపూర్, గోవెన, కెరమెరి మండలం జోడేఘాట్ ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి అవస్థలు పడుతున్నామని, తిర్యాణిలో కొత్తగా 10 సబ్పోస్టాఫీసుల పరిధిలో సిగ్నల్స్ లేక లబ్దిదారులు ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చి పింఛన్ తీసుకుంటున్నారని అధికారులు ఎంపీకి వివరించారు. మిషన్ భగీరథలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందడం లేదని ఎంపీకి విన్నవించారు.
ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించిన నేషనల్ హైవేపై ఆరు నెలలైనా గడవక ముందే గుంతలు ఎందుకు పడుతు న్నాయని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అధికారులను ప్రశ్నించారు. నాసిరకం పనుల కారణంగానే హైవేపై గుంతలు ఏర్పడుతున్నాయని, నేషనల్ హైవే నిర్మా ణంలో అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటిం చాలని సూచించారు. హైవేరోడ్డుకు ప్యాచ్ వర్క్‌లు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. కేంద్ర విద్యాలయాల ఏర్పాటుకు నివేదికలు పంపించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో అమలవుతున్న ఉజ్వల, ఆర్అండ్బీ, ఎంపీల్యాండ్స్, డీఎంఎఫ్టీ, కిసాన్ సమ్మాన్ యోజన, గిరిపోషణ్, మైనింగ్, ఎన్ఆర్ఈజీఎస్ పథకాలపై ఎంపీ సమీక్షించారు.
– ఆదిలాబాద్ ఎంపీ నగేశ్
గతంలో లేని విద్యుత్ సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు ప్రశ్నించారు. ముఖ్యంగా గత ఆరు నెలలుగా విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని, గతంలో ఉన్న అధికార యంత్రాంగమే ఇప్పుడు కూడా పనిచేస్తుం దని, మరి ఈ సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నిం చారు. మళ్లీ జనరేటర్లకు పనికల్పించాల్సి వస్తుంద ని, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెజ్జూర్ పీఏసీఎస్‌లో జరిగి న అక్రమాలపై పూర్తి విచారణ చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. వచ్చే జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తామని ప్రకటించిందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయా.. రైస్‌మిల్లర్లు బియ్యాన్ని సరఫరా చేయగలుగుతారా… దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటు న్నారని అడిగి తెలుసుకున్నారు.
– సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు