బెల్లంపల్లి, ఆగస్టు 4: బెల్లంపల్లి పట్టణంలో మళ్లీ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవిలో సకాలంలో నీటిని సరఫరా చేయకపోవడం, పైపులు పగిలాయని మరికొన్ని రోజులు సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాలకాలంలోనైనా నీటి కష్టాలు తీరుతాయనున్న బెల్లంపల్లి పట్టణవాసులకు మళ్లీ తిప్పలు తప్పడం లేదు. తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడా ప్రాజెక్ట్ ఇన్‌టేక్ వెల్ వద్ద నాచు పేరుకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది.
వారం పాటు తాగునీటి సరఫరా అంతరాయం ఉంటుందని రెండు రోజుల క్రితమే బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ ప్రకటనలో తెలిపారు. కమిషనర్ ప్రకటన చేయకముందే చాలా వార్డుల్లో ఐదురోజులుగా నీటి సరఫరా చేయలేదని పలు కాలనీల ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఐదు రోజల కోసారి సరఫరా చేస్తుండగా ఇప్పుడు వారం పాటు నిలిపివేయడంతో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు.
బెల్లపల్లి మున్సిపాలిటీకి రోజుకు 11ఎంఎల్డీ అవసరం
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 15 వేలకు పైగా నివాస గృహాలుండగా 11వేల తాగునీటి కనెక్షన్లున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడా ప్రాజెక్ట్ నుంచి ఇన్‌టేక్ వెల్ ద్వారా పట్టణంలోని ఐదు వాటర్ ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీలో వాటర్ కనెక్షన్ల ఆధారంగా 11ఎంఎల్డీ(మిలియన్ లీటర్ ఫర్ డే) అవసరం ఉండగా కేవలం 6 ఎంఎల్డీ మాత్రమే కుమ్రం భీం అడా ప్రాజెక్ట్ నుంచి సరఫరా అవుతుందని అధికారులు చెబుతున్నారు. వాటర్ సప్లయ్ విభాగంలో 25 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అయినా సర్దుబాటు చేస్తూ ప్రతి రోజూ కొన్ని వార్డులకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అడా ప్రాజెక్ట్ వద్ద ఎన్నడూ లేని విధంగా నాచు పెద్ద మొత్తంలో పేరుకపోయిందని, తొలగించి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
వారం రోజులు తాగునీటి సరఫరా ఉండదని తెలుసుకున్న కొన్ని బస్తీల ప్రజలు మున్సిపల్ అధికారులతో మాట్లాడి వాటర్ ట్యాంకర్లను తెప్పించుకుని రోజూ వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. సింగరేణి క్వార్టర్లలోని కార్మిక కుటుంబాల ప్రజలు సింగరేణి సరఫరా చేసే నీటిని వినియోగించుకుంటున్నారు. మరికొంత మంది ఫిల్టర్ వాటర్‌ను కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అధికారులు విఫలం అవుతున్నారని పలు వార్డుల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఇన్‌టేక్ వెల్ వద్ద నాచును త్వరగా తొలగించి నీటి సరఫరా పునరుద్ధరించాలని పట్టణవాసులు కోరుతున్నారు.
రోజుకు కొన్ని బస్తీలకు నీటి సరఫరా
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడ ప్రాజెక్ట్ ఇన్‌టెక్ వద్ద పెద్ద ఎత్తున నాచు పేరుకుపోవడంతో బెల్లం పల్లి మున్సిపాలిటీ పరిధిలో వారం పాటు తాగునీటి సరఫరా సరిగా జరగడం లేదు. గతంలో రెండు రోజులకోసారి సరఫరా చేశాం. ప్రస్తుతం ఈ వారం రోజుల్లో కొంత ఇబ్బంది ఏర్పడుతున్నది. ట్యాంకుల నిండిన తర్వాత వార్డుల్లో తాగునీటి సరఫరా చేస్తున్నాం. ఈ నెల 3న షంషీర్‌నగర్, అంబేద్కర్ నగర్, రెండవ వార్డు గ్రౌండ్ బస్తీల్లో నీటిని సరఫరా చేశాం. 4న గొల్లగూడెం, టేకులబస్తీ, 5న బజార్ ఏరియాలో సరఫరా చేస్తాం. మరో మూడురోజుల్లో అన్ని బస్తీల్లో నీటి సరఫరాను పునరుద్ధరిస్తాం.
-తన్నీరు రమేశ్, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్