ఆదిలాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సాగు ప్రారంభమైంది. సాగు కోసం భూములను సిద్ధం చేసుకున్న రైతులు నాలుగు రోజుల నుంచి వానలు పడుతుండడంతో విత్తనాలు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
అధికంగా పత్తి పంటను 4 లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నారు. వీటితోపాటు సోయా, కంది పంటలను కూడా వేస్తారు. గతేడాది పత్తి విత్తనాల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ యేడాది అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సరిపడా విత్తనాలను సరఫరా చేస్తున్నారు. ఏటా విత్తనాలు, ఎరువుల ధరలు పెరుగుతుండడంతో రైతులకు పెట్టుబడులు కూడా పెరిగాయి. పత్తి ఎకరం సాగు చేయడానికి రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు అంటున్నారు.
దళారులే ఆధారం
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకంలో భాగంగా ఎకరాకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేసింది. ఏటా సీజన్‌కు ముందుగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడంతో అన్నదాతలు తమకు అవసరమైన విత్తనాలను కొనుగోలు చేసుకుని సిద్ధంగా ఉంచుకునే వారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం అమలు నామమాత్రంగానే మారడంతో పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. దీనిని అవకాశంగా భావించి దళారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు.
అప్పు కింద రైతుకు రూ.80 వేలు ఇస్తే నాలుగు నెలల్లో పత్తి పంటను విక్రయించిన తర్వాత రూ. ఒక లక్ష చెల్లించాల్సి ఉంటుందని రైతులు అంటున్నారు. కష్టపడి పండించిన పంటను దళారులు చెప్పిన జిన్నింగ్లకు విక్రయించాలనే షరతు ఉంటుందని రైతులు తెలిపారు. గతంలో రైతుబంధు వస్తుందనే నమ్మకంతో విత్తనాల దుకాణదారులు ఉద్దెర ఇచ్చేవారని, ఇప్పుడు రైతు భరోసా రాకపోవడంతో ఉద్దెర ఇవ్వడం లేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు రైతు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.
దళాల్ దగ్గర అప్పు తీసుకున్నా..
నాకు ఐదెకరాల భూ మి ఉండగా పత్తి వేస్తా. రైతుభరోసా పైసలు రాకపోవడంతో విత్త నాలను కొనడానికి దళాల్ వద్ద అప్పు చేయాల్సి వచ్చింది. వానలు పడుతున్నా యి. యాసంగి రైతు భరోసా రాలేదు. ఇప్పుడే పత్తి విత్తనాలు వేస్తే దిగుబడి బాగా ఉంటుంది. పెట్టుబడి కోసం పైసలు ఎక్కడా దొరకలేదు. రైతు భరోసా వస్తదనే నమ్మకం లేకపోవ డంతో దళాల్ వద్దకు పోయి అప్పు తీసుకుని విత్తనాలు కొనుక్కొని పోతు న్నా. రైతు భరోసా పథకం కింద సీజ న్కు ముందుగానే డబ్బులు రైతు లకు అందితే మంచిగా ఉంటుంది. చేతిలో పైసలు ఉంటే మాకు వచ్చిన విత్తనాల ను ముందుగానే కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకుంటాం. ప్రభుత్వం రైతులకు పెట్టబడి సాయం తొందర గా అందించాలి.
– గంగారం, రైతు, పిప్పల్‌ధరి, ఆదిలాబాద్ రూరల్ మండలం
రైతు భరోసా వస్తలేదు..
మాకు ఐదెకరాల భూమి ఉంది. సాగునీరు లేకపోవడం తో వర్షాలపై ఆధారపడి వానకాలం పంటలు మాత్రమే వేస్తాము. ఈ సీజన్లో పత్తి, కంది పండిస్తాము. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పైసలు వచ్చేవి. ఇప్పుడు రావడం లేదు. యాసంగిలో కూడా రైతుభరోసా పైసలు రాలేదు. దీంతో అప్పు చేసి సాగు చేయాల్సి వస్తుంది. బ్యాంకు లోన్లు కూడా ఇవ్వడం లేదు. అప్పుల కోసం దళారులు వంద షరతులు విధిస్తారు. పత్తి పంట తీయగానే రోజు వచ్చి అప్పు వడ్డీతోపాటు చెల్లించమంటారు. మాలాంటి పేద రైతుల గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి. రైతు భరోసా పైసలు వెంటనే అందజేయాలి.
– టేకం మనిరాం, గుంజాల, భీంపూర్ మండలం