తాండూర్ : మూడు మండలాలకు కూడలిగా ఉన్న మంచిర్యాల జిల్లా తాండూర్( Tandur ) మండలం రెచిని రోడ్ రైల్వే స్టేషన్ ( Rechini Road Railway Station ) అలంకార ప్రాయంగా మారింది. ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడిన ఈ రైల్వే స్టేషన్ నేడు ఒకటి, రెండు రైళ్ల హాల్టింగ్లకే పరిమితమై ప్రయాణికులకు పరీక్షలు పెడుతోంది. కరోనా విపత్తు సమయంలో కొన్ని, రైల్వేస్టేషన్ ఆధునికరణ పనుల పేరిట మరికొన్ని రైళ్ల హాల్టింగ్ లను ఎత్తివేశారు. దీంతో ప్రజలు బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వే స్టేషన్లకు వెళ్లి తమ రాకపోకలను కొనసాగించాల్సి వస్తోంది.
కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు
రేచిని రోడ్ రైల్వే స్టేషన్ను కేంద్ర రైల్వే శాఖ ఇటీవల కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునీకరణ పనులు చేపట్టింది. నూతన బుకింగ్, సిగ్నల్ బిల్డింగ్ నిర్మాణం, నూతన ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు, రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి తో పాటు ఎన్నో రకాల సౌకర్యాలు కల్పించింది. రైల్వే స్టేషన్ ను ఆధునికరించినప్పటికీ అందుకు తగ్గట్లుగా సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో రైల్వే అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు రైలు కష్టాలు తప్పడం లేదు.
రైళ్ల హల్డింగులపై ఉదాసీనత
రేచిని రోడ్డు రైల్వే స్టేషన్లో గతంలో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్, రామగిరి ప్యాసింజర్, సింగరేణి ప్యాసింజర్, పుష్పుల్, జమ్ముతావి ఎక్స్ప్రెస్, నాగపూర్ సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్తో పాటు పలు రైళ్లు ఇక్కడ ఆగేవి. కరోనా విపత్తు సమయంలో ఈ రైళ్ల హాల్టింగ్ లను ఎత్తివేశారు. ఆ తరువాత భాగ్యనగర్, పుష్పుల్ ప్యాసింజర్లను ఇటీవల కాలంలో ఇంటర్సిటీ రైళ్ల హాల్టింగ్లను పునరుద్ధరించారు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే సింగరేణి, రామగిరి ప్యాసింజర్ల హాల్టింగ్ లు కల్పించడంలో పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి సింగరేణి, రామగిరి స్యాపింబర్ల హాల్టింగులను పునరుద్ధరించాలని కోరుతున్నారు.