కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంట్ కంపెనీని పునఃప్రారంభించాలన్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రోజుకో తీరున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి.. జాతీయ రహదారి-44ను దిగ్బంధించారు. దాదాపు రెండు గంటలపాటు బైఠాయించడంతో ఎనిమిది కిలోమీటర్ల మేర వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఐదు మండలాల నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తరలిరాగా.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశ్రమను తెరిచే వరకూ ఉద్యమం ఆగదని, ఈ విషయంపై ఎంపీ సోయం బాపురావ్ స్పందించక పోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 10 : కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునఃప్రారంభించాలంటూ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు సాధన కమిటీ సభ్యులు, శాసనసభ్యుడు జోగు రామన్నతో కలిసి వందలాది మంది ఆదిలాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయం నుంచి చాందా(టీ) వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారి(ఎన్‌హెచ్-44)పై భైఠాయించారు. దాదాపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా నిర్వహించారు. రెండు గంటలపాటు ఆందోళనతో రహదారికి ఇరువైపులా దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. అక్కడే కళాజాత బృందాలతో ధూంధాం నిర్వహించారు. వాహనదారులకు ఎమ్మెల్యే ఆహార పొట్లాలు, మంచినీరు అందజేశారు. కాగా.. తాంసి, బేల, తలమడుగు, జైనథ్ మండలాల నుంచి వందలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వేలాది మంది కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి కల్పించే సిమెంట్ కంపెనీని సాధించే వరకూ ఉద్యమాన్ని ఆపబోమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. సీసీఐ సాధన కమిటీ నేతృత్వంలో తాము నిరంతరంగా నిరసనలు చేపడతామని.. దీనికి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడం సంతోషమన్నారు. సీసీఐ కోసం రాష్ట్రం బకాయిల రద్దు సహా అవసరమైన అన్ని సౌకర్యాలకు రాష్ట్ర సర్కారు హామీ ఇచ్చినా కేంద్రంలో కదలిక లేదన్నారు. మంత్రి కేటీఆర్ కేంద్రానికి ఎన్ని సార్లు లేఖలు రాసినా స్పందించకపోవటం విడ్డూరమని గుర్తు చేశారు. సీసీఐ మూసివేతతో వేలాది కుటుంబాలు చిన్నా భిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం జేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ సాక్షిగా విషం కక్కుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐ పాత బకాయిలు చెల్లిస్తే.. ఎన్ని డబ్బులైనా ఖర్చు చేసి సీసీఐని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని సాధన కమిటీ సభ్యులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించినట్లు తెలిపారు. సీసీఐ సాధన ప్రజా ఉద్యమంగా మారిందని, కేంద్రం మెడలు వంచి సీసీఐని తెరిపించుకుంటామని హెచ్చరించారు. సీసీఐని ప్రారంభిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినా బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ జిల్లాలో ఆందోళనలు జరిగినా ఎందుకు స్పందించడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన కేంద్ర ప్రభుత్వం సీసీఐ జోక్యానికి వస్తే తగినబుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నగేశ్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, గంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు తాటిపెల్లి రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, ఎంపీపీ లక్ష్మీ జగదీశ్, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కో-కన్వీనర్ విజ్జగిరి నారాయణ, సీపీఎం నాయకులు బండారు రవికుమార్, దత్తాత్రి, లంకా రాఘవులు, లోకారి పోశెట్టి, టీఆర్ఎస్ నాయకులు ఇక్బానీ, బాలశంకర్ కృష్ణ, ఆదిలాబాద్, జైనథ్, బేలా మండలాల టీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
సీసీఐలో మెషిన్ టూలర్గా ఉద్యోగం చేసిన. రూ.650 జీతం నుంచి పనిచేసిన. సీసీఐ మూతపడేనాటికి(2001) రూ.19,500 జీతం తీసుకున్న. మా పిల్లలిద్దరూ మూగ,చెవిటి వారు. కష్టపడి చదివించిన. సీసీఐ మూతపడిన తర్వాత చిన్న కిరాణంలో పనికి కుదిరిన. చాలీచాలని జీతంతో వెళ్లదీస్తున్న. నాతో పాటు పని చేసిన దాదాపు 700 కార్మిక కుటుంబాలు కష్టాల్లో ఉన్నయ్. సీసీఐని మళ్లా తెరిపించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సార్లు గట్టిగ ప్రయత్నం చేస్తున్నరని తెలిసి సంతోష పడుతున్నం. మా ఎమ్మెల్యే జోగురామన్న కూడా సీసీఐ సాధన కమిటీతో కలిసి తండ్లాడుతున్నరు. మేము కూడా ధర్నాల పాల్గొన్నం. కేంద్ర సర్కారు ఇప్పటికైనా ఆలోచించాలి. సీసీఐ తెరిచే దాకా పోరాడుతుం. – అంజయ్య, మాజీ టెక్నీషియన్ ,సీసీఐ ఆదిలాబాద్
సీసీఐల పన్జేస్తున్నప్పుడు నెలకు రూ.10 వేల జీతం అస్తుండే. అట్లనో ఇట్లనో బతుకెళ్లదీసినం. ఇగ అది కూడా మూతపడ్డంక మా బతుకులు ఆగమైనయ్. ఏం చేయాల్నో తెల్వక దొరికిన పని చేసుకుంట వచ్చినం. ఇప్పుడు నాకు 64 ఏండ్లు. ఏ పని చేయరాదు. మస్తు తిప్పలైతంది. మా కొడుకు ప్రైవేట్ల ఉద్యోగం చేస్తున్నడు. సీసీఐని తెరిపించేందుకు మన సర్కారు కోసీజ్ చేస్తున్నదని తెలిసి మేము కూడా ఉద్యమంల నిలబడ్డం. ఎమ్మెల్యే జోగురామన్న, టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం. మాలాంటోళ్ల బతుకులతో ఆడుకుంటున్న కేంద్రమోళ్లు ఇగనైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది.
-సిండే ప్రకాశ్ , కార్మికుడు ,సీసీఐ ఆదిలాబాద్
ఎడ్లాపురం సీసీఐ ఫ్యాక్టరీ నడిసినప్పుడు మా బతుకులు మంచిగుండె. అ ది మూతవడ్డంక మా బతుకులు రోడ్డున పడ్డయి. ఇప్పటికీ సీసీఐల నూరేండ్లకు సరిపడా ముడిసరకు ఉన్నది. సీసీఐని మళ్లా తెరిపించాలని టీఆర్ఎస్ సర్కారు కొట్లాడుతున్నది. ఇందుకు సంతోషంగా ఉంది. సీసీఐ తెరిస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి దొరుకుతది. అట్లనే ఆదిలాబాద్‌కు మళ్లా కళ వస్తది. – రవి, సీసీఐలో ప్యాకర్( మాజీ) ఆదిలాబాద్