కుంటాల, సెప్టెంబర్ 9 : మౌలిక వసతుల కల్పనకు అన్ని విధాలా కృషిచేస్తామని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. తన దత్తత గ్రామం మండలంలోని సూర్యాపూర్‌లో శనివారం ఆయన పర్యటించారు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం రూ.45 లక్షలతో నిర్మిస్తున్న కల్యాణ మండప నిర్మాణం పనులను పరిశీలించారు. పురోగతిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆయన మాట్లాడారు. గ్రామంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, రూ.1.31 కోట్లతో ఓలా నుంచి సూర్యాపూర్ శివాలయం వరకు బీటీ రోడ్డు, రైతుల కోసం సూర్యాపూర్ నుంచి రాజాపూర్ వరకు రూ.94 లక్షలతో గ్రావెల్ రోడ్డు, శివాలయానికి కమ్యూనిటీ హాల్, రైతు వేదిక, అంగన్వాడీ కేంద్ర భవనం, అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే భారీ వర్షానికి దెబ్బతిన్న సూర్యాపూర్- రాజాపూర్ రోడ్డును, కోతకు గురైన బీటీ రోడ్ల దుస్థితిని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కుంటాల-వెంకూర్ మార్గమధ్యలో తన కారును ఆపి, ప్రజలు భూ సమస్యలపై విన్నవించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బక్కి సునీత, భోజన్న, ఉప సర్పంచ్ అయిటి రాజన్న, నాయకులు సాయికిరణ్, దొంతుల మల్లేశ్, దొంతుల శివాజీ తదితరులు పాల్గొన్నారు.
కుంటాల ఎంపీపీ అప్క గజ్జారాం తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనను ఎమ్మె ల్యే పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌బాబు, సారంగాపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి కూడా పరామర్శించారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు ఒడ్నం అనిల్, నాయకులు వెంకట్ రావు, రాధాకృష్ణ తదితరులున్నారు.
భైంసా, సెప్టెంబర్ 9 : వైద్యుల సేవలు అభినందనీయమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యుడు ప్రీతమ్‌ను శనివారం ఆయన అభినందించారు. దేశం లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 15వ తేదీన 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారని తెలిపారు. డయాలసిస్ బాధితుల కోసం 5 బెడ్లతో సెంటర్‌ను కూడా మంజూరు చేసినట్లు, సంబంధించిన పరికరాలను త్వరలో అమర్చనున్నట్లు చెప్పారు. వైద్యులు ప్రీతమ్, సురేందర్, అనిల్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ కాశీనాథ్‌ను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జేకే పటేల్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, కార్యదర్శి తోట రాము, ఆసిఫ్, వైద్యులు పాల్గొన్నారు.