తాంసి, సెప్టెంబర్ 12 : కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పాలించి రాష్ర్టాన్ని అంధకారం చేసిందని, సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మంగళవారం తాంసిలో పీఆర్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు రూ. 13,01,508 విలువ గల కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అందుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మంజులాశ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ తాటిపల్లి రాజు, ఎంపీడీవో ఆకుల భూమయ్య, తహసీల్దార్ లక్ష్మి, వైస్‌ఎంపీపీ ముచ్చ రేఖ రఘు, సర్పంచ్‌లు సదానందం, వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు అరుణ్, గంగారెడ్డి, నారాయణ, లింబాజీ, ఉత్తమ్ పాల్గొన్నారు.
పీఆర్ సబ్ డివిజన్ కార్యాలయం ప్రారంభం
బోథ్, సెప్టెంబర్ 12 : బోథ్‌లోని ఫ్రెండ్స్ క్లబ్ ఆవరణలోని పశువైద్య కేంద్రంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ప్రారంభించారు. కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్, జడ్పీటీసీ సంధ్యారాణి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణరెడ్డి, సర్పంచ్ సురేందర్‌యాదవ్, ఏఎంసీ చైర్మన్ రుక్మాణ్‌సింగ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, రాథోడ్ లింబాజీ పాల్గొన్నారు. అనంతరం కోటా (కే) గ్రామంలో రూ.20 లక్షలతో చేపడుతున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. సర్పంచ్ పేశ్వే పూజ, ఎంపీటీసీ జమున, నాయకులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
బోథ్, సెప్టెంబర్ 12: బోథ్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 16 లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను ఆదిలాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అందజేశారు. కార్యక్రమంలో నాయకులు లింబాజీ, ప్రవీణ్, గంగారెడ్డి, పల్లవి, పోశెట్టి, సోమన్న పాల్గొన్నారు.
హిందీ భాషా దినోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం
ఎదులాపురం,సెప్టెంబర్12: ఆదిలాబాద్‌లోని జడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించే హిందీ భాషా దినోత్సవం కార్యక్రమానికి హాజరుకావాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బావురావ్ను హిందీ భాషా సేవా సమితి సభ్యులు ఆహ్వానించారు. కార్యక్రమంలో హిందీ భాషా సమితి జిల్లా అధ్యక్షుడు సుకుమార్ పెట్కూలే, ప్రధాన కార్యదర్శి రవి జాబాడే , ప్రచార కార్యదర్శి సాంబన్న షిండే, తదితరులు పాల్గొన్నారు.