హాజీపూర్, జనవరి 22 : ఇండ్లు నిర్మించుకునే పేదలకు ఉచితంగా ఇసుక రవాణా చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పేర్కొన్నారు. సోమవారం వేంపల్లి గ్రామ శివారులోని గోదావరిలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతేడాది ట్రాక్టర్ ట్రిప్పు ధరపై ప్రస్తుతం రూ.50 తగ్గిస్తున్నామన్నారు. వేంపల్లి గ్రామ ప్రజలకు తక్కువ ధరకు ఇసుకను అందిస్తామన్నారు.
ఇండ్లు నిర్మించుకునే పేదలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే ఇసుక రవాణా చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై త్వరలో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడీ బాలు, సర్పంచ్ ఓలపు శారద, ఎంపీటీసీలు డేగ బాపు, ఒడ్డె బాలరాజు, డిప్యూటీ తహసీల్దార్ హరిత, ఆర్ఐ మంగ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట రవి, తదితరులు పాల్గొన్నారు.