ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని వేల కోట్లతో అన్ని విధాలా అభివృద్ధి చేశారని, ఐటీ టవర్, జేఎన్టీయూ, బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ, సబ్ స్టేషన్లు.. ఇలా అనేక పనులు చేపట్టారని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్‌ను విద్యాక్షేత్రంగా మార్చిందన్నారు.
ఈ సందర్భంగా ఇక్కడ ఫార్మసీ, పీజీ కళాశాల కూడా కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. జిల్లాలో పత్తి ఎక్కువగా పండుతున్న నేపథ్యంలో టెక్స్టైల్స్ పార్క్ నిర్మిస్తే ఇక్కడి నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుందని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసులు, గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చి ఆదుకున్నారని, మరికొంత మంది మిగిలిపోయారని, వారికి కూడా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. మరిన్ని అభివృద్ధి పనులు కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు.