ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 19 : నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న చరిత్ర కలిగిన బీజేపీకి, వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందన్న భావనలో ఉన్న కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చి అన్నదాతను రాజు చేస్తున్న సీఎం కేసీఆర్కు సంపూర్ణ మద్దతు పలకాలని, కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి బాటలో నడవాలని పేర్కొన్నారు.
ఆదివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అర్లి, జందాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జోగు రామన్నకు డప్పుచప్పుళ్ల నడుమ ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులతో ఆప్యాయంగా మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. బీఆర్ఎస్ మ్యానిఫెపోస్టోను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనల్లో వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న రైతుల ఆందోళనపై కార్లను ఎక్కించడంతో నలుగురు మరణించారని అన్నారు. రైతుల ప్రాణాలు బలిగొన్న తర్వాత కేవలం క్షమాపణలతో ప్రధాని సరిపెట్టుకున్నారని పేర్కొన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందన్న భావనలో ఉన్నారని, ఆ పార్టీ నేతలు ఇటీవల రైతుబంధు నగదును నిలిపివేయాలని ఈసీకి ఫిర్యాదు చేయడం రైతు సంక్షేమంపై వారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్న సీఎం కేసీఆర్కు సంపూర్ణ మద్దతు పలికి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 19 : ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లి గ్రామానికి చెందిన ఆకుల నవీన్, జందాపూర్కు చెందిన చిలుకూరి రామన్న ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.