కాగజ్నగర్, జూన్ 23 : అందెవెళ్లి పెద్ద వాగు వద్ద వెం టనే అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగుతానని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని అందెవెళ్లి పెద్ద వాగు వద్ద నిర్మాణంలో ఉన్నా బ్రిడ్జితో పాటు వర్షానికి కొట్టుకు పోయిన తాత్కాలిక వంతెనను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అక్రమ ఇసుక తవ్వకాలతోనే రెండేళ్ల క్రితం బ్రిడ్జి కూలిపోయిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మంత్రి సీతక్క బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు.
సకాలంలో బిల్లులు అందకపోవడంతోనే సదరు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయడం లేదని చెప్పారు. పెద్దవాగుపై బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో దహెగాం, భీమిని మండలాలకు చెందిన సుమారు 50 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. సోమవారం సమస్య పరిష్కరించకపోతే బ్రిడ్జిపైనే నివరధిక సమ్మె చేస్తానని స్పష్టం చేశారు. ఈ సమ్మెకు ఆయా గ్రామాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.