తలమడుగు, ఆగస్టు 19 : ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తలమడుగు మండలానికి మంగళవారం ఉదయం వస్తారని అధికారులు ప్రకటించారు. వర్షానికి దెబ్బతిన్న పంటల వద్ద రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు వేచి చూశారు. తమ గోడును తెలుపుకుందామనుకున్న రైతులు, ముంపు బాధితులకు నిరాశే ఎదురైంది.
రాత్రి 8 గంటలు అయినా మంత్రి రాకపోవడంతో తమ ఇండ్లలోకి వెళ్తామనుకుంటున్న సమయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వచ్చారు. ఎమ్మెల్యే పొలాలకు వెళ్లి నష్టపోయిన పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. రాత్రి వరకు ఆయా గ్రామాల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీవో శంకర్, ఏవో ప్రమోద్ రెడ్డి, తదితరులు ఉన్నారు.