కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : మిషన్ భగీరథ క్షేత్రస్థాయి సిబ్బంది ఐదు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నది. నీటి సరఫరాలో నిరంతరం కష్టపడే వీరికి సకాలంలో జీతాలు రాక అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కుమ్రం భీం ప్రాజెక్టు నుంచి జిల్లాలోని 15 మండలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు మండలాలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిధిలోలోని మూడు మండలాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నది. వాల్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, సూపర్వైజర్లు ఇలా సుమారు 600 మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. వీరికి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు వేతనాలుంటాయి.
కేసీఆర్ సర్కారులో..
ఇంటింటికీ నీరందించే లక్ష్యంతో తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకాన్ని కేసీఆర్ సర్కారు విజయవంతంగా అమలు చేసింది. ప్రతి నెలా సకాలంలో జీతాలు అందించింది.ఎక్కడా నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తలేదు. కానీ.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నిర్వహణ గాడి తప్పింది. సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక గ్రామాలకు తాగు నీరు సరఫరాకాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు సకాలంలో వేతనాలు అందించాలని మిషన్ భగీరథ క్షేత్రస్థాయి సిబ్బంది కోరుతున్నారు.
జీతాలు రావట్లే
మాకు ఐదు నెలలుగా జీతాలు రావట్లేదు. రాత్రీ.. పగలూ పనిచేసి తాగు నీరు సరఫరాలో ఇబ్బం దుల్లేకుంట చూస్తున్నం. ఇంత కష్టపడ్డా ఫలితం లేకుంటైతంది. కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నం. ఇకనైనా సర్కారు స్పందించి సకాలంలో జీతాలు ఇవ్వాలి.
– చాపిడి బాలేశ్, వాల్ ఆపరేటర్, ఆసిఫాబాద్
అసలే జీతం తక్కువ
కుమ్రం భీం ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ నీరు సర ఫరా అయ్యే గ్రామాల పరిధిలో దాదాపు 600 మంది సిబ్బంది పనిచేస్తున్నరు. మాకు ఇచ్చే జీతం కూడా తక్కువే. గా డబ్బులు కూడా నెల నెలా ఇవ్వడం లేదు. ఐదు నెలలుగా అవస్థలు పడుతున్నం. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
– మాచరాల బుద్ధయ్య, ఆపరేటర్, కెరమెరి