కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : అధికారుల నిర్లక్ష్యం ఆ కొలాం గ్రామానికి శాపంగా మారింది. కేసీఆర్ సర్కారులో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరందగా, ప్రస్తుతం పైపులైన్‌కు మరమ్మతులు చేసే నాథుడు లేక ప్రజానీకం అవస్థలు పడాల్సి వస్తున్నది. గొంతు తడుపుకునేందుకు కిలోమీటర్ దూరంలోనున్న వ్యవసాయ బావి వద్దకు కాలినడకన వెళ్లి రావాల్సిన దుస్థితి నెలకొంది.
కెరమెరి మండల కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలోనున్న పాటగూడలో సుమారు 50 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ కేసీఆర్ సర్కారు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మించి.. ఇంటింటికీ నల్లాలు బిగించి నీటిని సరఫరా చేసింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక నిర్వహణ లోపంతో పైపులైన్లు దెబ్బతిన్నాయి. కొన్ని రోజుల క్రితం అధికారులు మరమ్మతులు చేయించినప్పటికీ ఆ తర్వాత పైపులైన్ లీకేజీ కావడంతో తాగు నీటి సమస్య మొదలైంది.
సుమారు నాలుగైదు నెలలుగా తాగు నీరు సరఫరాకాక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఒకేఒక్క చేతిపంపు ఉండగా, ప్రస్తుతం ఎండలు ముదరడంతో భూగర్భ జలాలు అడుగంటి నీరు రావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కిలోమీటర్ దూరంలోనున్న వ్యవసాయ బావి నుంచి తాగు నీరు తెచ్చుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ బావి కూడా ఎండిపోతుందని, ఆ పరిస్థితిని తలుచుకుంటేనే భయంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ తాగు నీటి గోస తీర్చాలని వారు వేడుకుంటున్నారు.