నిర్మల్ చైన్‌గేట్, సెప్టెంబర్,15: వైద్యరంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని, ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా ముందుకెళ్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లో శుక్రవారం వైద్య కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా దివ్యా గార్డెన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్‌కు వైద్య కళాశాల మంజూరు తో ఈ ప్రాంత వాసులు వైద్యవిద్య అభ్యసించే అవకాశం లభించిందని తెలిపారు. ఈ ప్రాంత విద్యార్థుల వైద్య విద్య కల నెరవేరబోతున్నదని చెప్పారు. నిర్మల్ కు మెడికల్ కళాశాల రావడంతో వంద మంది డాక్టర్లు వచ్చినట్లు తెలిపారు. నర్సింగ్ కళాశాల కూడా మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీఇచ్చారని తెలిపారు. వైద్య కళాశాల నిర్మాణానికి రూ. 166 కోట్లు కేటాయించారని చెప్పారు.
ఇకపై పూర్తిస్థాయి వసతులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్‌కు నిరంతరం ఇక్కడి నుంచి రవాణా సౌకర్యం ఉందని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజి రాజేందర్, ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ జీవీడీఎస్ ప్రసాద్, డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, సూపరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి, ప్రొఫెసర్లు, నాయకులు రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గణేశ్, మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, గౌతంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.