ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఊరూవాడా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ, పార్టీ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఎగురవేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్యాంపు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలతోపాటు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన వేడుకలకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి.. ఖానాపూర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేఖానాయక్, పార్టీ కార్యాలయం, భైంసా ఏరియా దవాఖానలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిలు పాల్గొని జెండా ఎగురవేశారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్ కూడా జెండా ఎగురవేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా.. ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు, శకటాలు ఆకట్టుకున్నాయి.
– ఆదిలాబాద్/నిర్మల్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్/నిర్మల్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లావ్యాప్తంగా మంగళవారం స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంతోపాటు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. అలాగే జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఖానాపూర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేఖానాయక్, పార్టీ కార్యాలయం, భైంసా ఏరియా ఆస్పత్రిలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ కొరిపెళ్లి విజయలక్ష్మి రాంకిషన్‌రెడ్డి, నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ వరుణ్‌రెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ప్రవీణ్‌కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. దేశభక్తిని పెంపొందించేలా వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ప్రతిభ కనపర్చిన ఉద్యోగులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రశంసాపత్రాలు అందజేశారు. తమ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు.