ఆదిలాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిం పేందుకు ప్రభుత్వం చేపట్టిన రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని అటవీ, ప ర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. మంగళవా రం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కార్యక్రమ అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కం టి సమస్యతో బాధపడుతున్న వారికి చికిత్సలు అందించడానికి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1500 వైద్య బృందాలను ఏర్పాటు చేసిందని, రూ.250 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం 100 రోజులపా టు కొనసాగుతుందన్నారు.
ఆదిలాబాద్ జిల్లా లో 33 వైద్య బృందాలను ఏర్పాటు చేయగా.. ప్రతి టీంలో పది మంది సిబ్బంది నేత్ర శిబిరా లు నిర్వహిస్తారన్నారు. పట్టణ ప్రాంతాల్లో రోజు 400 మంది, గ్రామాల్లో 300 మందికి పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి మందులు, కండ్లద్దాలు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా జిల్లా ఆస్పత్రుల్లో కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారన్నారు. అధికారులు ఎలాంటి సమస్యలు రాకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు
సేవాభావంతో పనిచేయాలి..
కంటి వెలుగు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవసరమని, వారు సేవాభావంతో పని చేయాలని కోరారు. శిబిరాల నిర్వహణకు ప్రజాప్రతినిధులు సహకరించాలని, ప్రజలు పరీక్షలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గూడేలు, తండాలు, పల్లెల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, శిబిరాల ఏర్పాట్లు చూడాలన్నారు. వృద్ధులకు కంటి సమస్యలు అధికంగా ఉంటాయి. వారు అవసరమైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రభుత్వం పేదల వైద్యసేవలకు పెద్దపీట వేస్తున్నదని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీ లోపు మున్సిపల్, మండల సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, అదనపు కలెక్టర్ నటరాజ్, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, ట్రెయినీ కలెక్టర్ శ్రీజ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మండల సమావేశాలు నిర్వహించాలి..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వైద్యశిబిరాల నిర్వహణలో భాగంగా పల్లెలు, గిరిజన గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకునేలా చూడా లి. ఇందుకోసం మండల స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. వీటికి రాయిసెంటర్ల ప్రతినిధులు, గిరిజన గ్రామాల పటేళ్లను పిలిచి వారికి అవగాహన కల్పించాలి.
– జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్
మారుమూల గ్రామాల్లో క్యాంపులు పెట్టాలి..
పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి కంటివెలుగు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. గిరిజన ప్రాంతాల్లో అందరూ పరీక్షలు చేయించుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. కంటి పరీక్షలు నిర్వహించే కేంద్రానికి అన్ని గ్రామాల నుంచి ప్రజలు వచ్చేలా తగిన ఏర్పాట్లు చేయాలి. గిరిజన ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తే అందరికీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అందుకు చర్యలు తీసుకోవాలి.
– రాథోడ్ బాపురావ్, ఎమ్మెల్యే, బోథ్
విస్తృతంగా ప్రచారం చేయాలి..
ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా మారుమూల గ్రామాలు, గిరిజన తండాలు, గూడేల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేయాలి. ఇందుకోసం స్థానిక నాయకుల సహకారం తీసుకోవాలి. కంటి సమస్యలున్న వారికి పరీక్షలు నిర్వహించడంతోపాటు కండ్లద్దాలు అందేలా స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి.
– జనార్దన్ రాథోడ్, జడ్పీ చైర్మన్, ఆదిలాబాద్