HomeAdilabadMinister Allo Indrakaran Reddy Said That The Government Is Paying Special Attention To Public Health
‘మహిళల ఆరోగ్యమే.. కుటుంబ సౌభాగ్యం
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లాలో ఒకే రోజు 12 దవాఖానల్లో ప్రారంభం
ఇప్పటివరకు పది కేంద్రాలు.. 15,493 మందికి చికిత్స..
సత్ఫలితాలిస్తున్న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం
హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా లోకం
‘మహిళల ఆరోగ్యమే.. కుటుంబ ఆరోగ్యం.. ఇంటింటి ఆరోగ్యమే సమాజ శ్రేయస్సు..’ అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ‘ఆరోగ్య మహిళ’ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతివలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటికి కళ వస్తుందనే లక్ష్యంతో ఆరు నెలల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన పది కేంద్రాలను ఆరంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 15,493 మందికి చికిత్సలు అందించారు. ప్రతి మంగళవారం శిబిరాలు నిర్వహిస్తూ.. అవసరం ఉన్న వారికి ప్రధాన దవాఖానలకు కూడా రెఫర్ చేస్తున్నారు. ప్రధానంగా మహిళలకు సంబంధించి ఎనిమిది రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ మంగళవారం కూడా అదనంగా మరో 12 కేంద్రాలను ప్రారం భించారు. నిర్మల్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్ర కరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి.. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎమ్మెల్యే చిన్నయ్య, కలెక్టర్ బదావత్ సంతోష్.. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్రాలను ప్రారంభించారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ : మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
లక్ష్మణచాంద, సెప్టెంబర్ 12 : ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య సమస్యలు తీర్చడానికి ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టామన్నారు. ఆరోగ్య సమస్యలు తీర్చడానికి సీఎం కేసీఆర్ 33 జిల్లాల్లో జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 150 పడకల మహిళ దవాఖాన ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా 350 బెడ్ల దవాఖాన అందుబాటులోకి వచ్చిందన్నారు. వైద్యులను నియమించడం ద్వారా వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ రాజేందర్, శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా ప్రచార కార్యదర్శి అడ్వాల రమేశ్, నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో మరో మూడు..
ఆదిలాబాద్, సెప్టెంబరు 12(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో బజార్హత్నూర్ పీహెచ్‌సీతోపాటు ఆదిలాబాద్ పట్టణంలోని హమాలీవాడి అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రతి మంగళవారం మహిళలకు వైద్యులు, సిబ్బంది చికిత్సలు అందిస్తున్నారు. ఈ రెండు దవాఖానల్లో ఇప్పటివరకు ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా 2,838 మందికి వైద్య సేవలు అందాయి. వీరిలో మెరుగైన చికిత్స కోసం 242 మందిని ఇతర దవాఖానలకు రెఫర్ చేశారు. తాజాగా మంగళవారం జిల్లావ్యాప్తంగా మరో మూడు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. పుత్లీబౌళీ అర్బన్ హెల్త్ సెంటర్, జైనథ్, ఉట్నూర్ మండలం శ్యాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.
మరో రెండు మహిళా క్లినిక్‌లు
ఆరు నెలల క్రితం గిన్నెధరి, దహెగాంలో ఏర్పాటు
తాజాగా కౌటాల, పెంచికల్పేట్లలో ప్రారంభం
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్య మహిళ కేంద్రాలను ప్రారంభిస్తున్నది. గర్భిణులు, బాలింతలతోపాటు యుక్తవయస్సులో ఉన్నవారికి ఈ సేవలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నది. గత మార్చిలో తిర్యాణి మండలం గిన్నెధరి, దహెగాం పీహెచ్సీలలో మహిళా క్లినిక్‌లను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా వైద్యసేవలు అందిస్తోంది. ఇందుకోసం మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది. గత ఆరు నెలల కాలంలో రెండు కేంద్రాల్లో కలిపి 3,319 మంది మహిళలు వైద్య సేవలు సద్వినియోగం చేసుకున్నారు. గిన్నెధరి మహిళా ఆరోగ్య కేంద్రంలో 1673, దహెగాం మహిళా ఆరోగ్య కేంద్రంలో 1646 మందికి వైద్యసేవలందాయి. కాగా, తాజాగా జిల్లాలో మరో రెండు మహిళా ఆరోగ్య కేంద్రాలు మంగళవారం ప్రారంభించారు. కౌటాల, పెంచికల్పేట్ పీహెచ్‌సీల్లో ఇకపై ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్యసేవలు అందించనున్నారు.
ఇప్పటివరకు అందిన చికిత్సలు
ఆదిలాబాద్ 2,838
నిర్మల్ 3,101
మంచిర్యాల 6,235
ఆసిఫాబాద్ 3,319
మొత్తం15,493
తెలంగాణ సర్కారు
మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. మహిళల్లో ఆరోగ్య సమస్యలు ఉండకూడదు.. ఏ తల్లి అనారోగ్యంతో బాధపడకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన రాష్ట్రంలోని ఆడబిడ్డల కోసం ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళల్లో ఆరోగ్య సమస్యలు గుర్తించి, చికిత్స అందించేందుకు 36 రకాల వైద్య పరీక్షలను ఈ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. తొలి విడుత కింద మంచిర్యాల జిల్లాలో తాళ్లగురిజాల, జన్నారం, హమాలీవాడ, ఇందారం ఆస్పత్రుల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం నిర్వహిస్తుండగా.. గడిచిన 27 వారాల్లో 108 శిబిరాల ద్వారా 6,235 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,434 మందికి ల్యాబ్ టెస్టులు చేశారు. సుమారు 6 వేల మందికి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయగా.. ముగ్గురికి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ఓరల్ ఎగ్జామినేషన్ ద్వారా సమస్య ఉన్న 345 మందికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఒకరికి నోటి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. కాన్సర్ ఉన్న వారికి సర్జరీలకు రెఫర్ చేశారు. 880 మంది సూక్ష్మపోషక లోపాలు ఉన్నట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. 1,021 మందికి థైరాయిడ్ ఉన్నట్లు తేలింది. మొత్తంగా 162 మందిని జిల్లా ఆసుపత్రికి, హైదరాబాద్‌కి రెఫర్ చేశారు. ఈ కేంద్రాల్లో మహిళలకు డయాగ్నోస్టిక్స్, మూత్రనాళాల ఇన్ఫెక్షన్, క్యాన్సర్ స్క్రీనింగ్, సూక్ష్మపోషక లోపాల గుర్తింపు, పీసీవోడీసీ, లైంగిక వ్యాధులు, శరీర బరువు వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ, చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మరో 100 కొత్త క్లినిక్‌లలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12 ఆసుపత్రుల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లాలో కాసిపేట, తాండూర్, నస్పూర్, రాజీవ్‌నగర్, దీపక్‌నగర్‌లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కలెక్టర్ బదావత్ సంతోష్ మిగిలిన చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్రాలను ప్రారంభించారు.
– మంచిర్యాల, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఎంతో సౌకర్యంగా ఉంది..
ఉట్నూర్ దవాఖాన్ల మహిళల కోసం ప్రత్యేక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసిన్రు. ప్రతి మంగళవారం ఇక్కడ టెస్టులు చేస్తమని చెప్పిన్రు. ఇది తెలిసే నేను కూడా దవాఖానల పరీక్షలు చేయించుకుందమని వచ్చిన. ఈ కేంద్రంలో మొత్తం మహిళా సిబ్బందే ఉన్నరు. ఎంతో సౌకర్యంగా ఉన్నది. లేడీ డాక్టర్లు ఉంటే సమస్యలు చెప్పుకునేందుకు ప్రాబ్లం ఉండదు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. నాకు కూడా టెస్టులు చేసి, అవసరమైన జాగ్రత్తలు చెప్పిన్రు. గతంలో ఈ టెస్టుల కోసం ప్రైవేట్ దవాఖానకు పోతుంటుమి. అక్కడ ఫుల్లు పైసలయితుండే. ఇప్పుడా ఇబ్బంది తప్పింది. ఇక్కడే అన్ని టెస్టులు ఫ్రీగా చేస్తున్నరు. అవసరమైన మందులు ఇస్తున్నరు. ఆరోగ్యపరంగా ఏ ప్రాబ్లం వచ్చినా ఇగ ఇక్కడికే వస్తం.
-గడ్డం స్వప్న, శ్యాంపూర్
మహిళల ఆరోగ్య సమస్యలు పరిష్కారం
ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో ఐదు ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మహిళలకు ప్రత్యేకించి ఎనిమిది రకాల వైద్యసేవలు అందిస్తున్నాం. రిమ్స్‌లో సేవా కేంద్రం ఏర్పాటు చేసి ముగ్గురు సిబ్బందిని నియమించి వారి వివిధ విభాగాలకు తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తారు. హైదరాబాద్ ఆసుపత్రులకు కూడా రెఫర్ చేసి చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ కేంద్రాల్లో మహిళా వైద్యులతోపాటు సిబ్బంది ఉంటారు.
– శ్రీధర్, ఆదిలాబాద్ జిల్లా నోడల్ అధికారి, ఆరోగ్య మహిళ
గతంలో ఏ ఒక్కలూ పట్టించుకోలే..
మహిళల ఆరోగ్యంపై ఉమ్మడి పాలనలోని ప్రభుత్వాలు ఏమాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నరు. వివిధ రకాల సమస్యలకు ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు మందులు ఇస్తున్నరు. నేను కూడా ఇయ్యాల దవాఖానకు వచ్చి పరీక్షలు చేయించుకున్న. మందులు అవసరమున్నవారికి ఇస్తున్నరు. లేడీ డాక్టర్లే ఇక్కడ పరీక్షలు చేసిన్రు. మా ఆరోగ్య సమస్యలు చెప్పుకునేందుకు లేడీ డాక్టర్లుంటనే మంచిది. కుటుంబ, పొలం పనులు చేసుకునే మాలాంటి వారికి ఇలా ప్రత్యేకంగా పథకం తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయడం బాగుంది. ప్రభుత్వం మంచి పనిజేసింది.