ఎదులాపురం, అక్టోబర్ 6 : పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గౌరవ వేతనం పెంచడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2019 జనవరిలో రూ.4వేలకు పెంచగా తాజాగా మరో రూ.2వేలు పెంచి రూ.6వేలు చేస్తూ జీవో విడుదల చేయడంతో ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాల్టీలో 85 మందికి ప్రయోజనం చేకూరనుంది. పట్టణాల్లో బ్యాంకు లింకేజీ రుణాలు, స్ట్రీట్ వెండర్స్‌కు రుణాల మంజూరు, బుక్ కీపింగ్ వంటి పనులతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కీలకపాత్ర పోషిస్తున్న తమను సీఎం కేసీఆర్ గుర్తించి వేతనాలు పెంచినందుకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సమైక్య పాలనలో మెప్మా ఆర్పీల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలకు పని చేసే వారు. పట్టణంలో పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న వారి సేవలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గుర్తించారు. మహిళా సంఘాల బలోపేతానికి ఆర్పీల పాత్రకీలకం. గౌరవ వేతన పెంపుతో వారు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంపిణీ చేసి కృతజ్ఞతలు చెబుతున్నారు.
16ఏళ్లుగా మెప్మా ఆర్పీగా పని చేస్తున్న. మెప్మా ఆర్పీల కష్టం గుర్తించిన సీఎం కేసీఆర్ సారు రెండు సార్లు వేతనం పెంచారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆర్పీల కుటుంబాలు రుణపడి ఉంటాం.
2013 సంవత్సరం నుంచి మెప్మా ఆర్పీగా పని చేస్తున్న. అప్పుడు ఎస్ఎల్ఎఫ్ ద్వారా రూ.2వేలు ఇస్తుండే. అప్పటి నుంచి ఎవరు వేతనాలు పెంచలేదు. కానీ 2019 జనవరిలో రూ.4వేలు వేతనం ఇచిండ్రు. ఇప్పుడు రూ.6వేలు పెంచిన సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు, ఏ ప్రభుత్వాలు మాకు వేతనాలు పెంచలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ సారు పెంచారు.