మంచిర్యాల, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజలకు సేవ చేసే రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల్లో రాజకీయ నాయకుల జోక్యం.. ఇప్పుడు మంచిర్యాలలో చర్చనీయాంశమైంది. మార్చి 3న నిర్వహించాల్సిన ఎన్నికలు వాయిదా పడడం వెనుక పెద్ద కుట్రే జరిగిందని సొసైటీలో శాశ్వత సభ్యత్వం కలిగిన కొందరు ఆరోపిస్తున్నారు. తొలుత నామినేషన్లు వేసిన 32 మందిలో.. ఫిబ్రవరి 25న ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ఇంట్లో నిర్వహించిన సమావేశానికి హాజరైంది కేవలం 22 మందే అని విశ్వసనీయ సమాచారం. ఇద్దరు స్థానికంగా అందుబాటులో లేనప్పటికీ వారు డీసీవో(డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ ఆఫీసర్)కు నామినేషన్లు విత్‌డ్రా చేసుకుంటున్నట్లు మెయిల్ చేశారని.. మిగిలిన వారికి చెప్పినట్లు తెలిసింది. మిగిలిన వారిలో కొందరి దగ్గరికెళ్లి సంతకాలు తీసుకోగా, మరికొందరిని అసలు పరిగణలోకే తీసుకోలేదట. 25న పీఎస్సార్ ఇంట్లో మీటింగ్ జరిగినప్పుడు నామినేషన్ల విత్‌డ్రా ఫారాలపై మాత్రం 24వ తేదీ వేసి సంతకాలు తీసుకున్నట్లు కొందరు చెబుతున్నారు. వాటినే తీసుకెళ్లి 25వ తేదీన కలెక్టరేట్ కార్యాలయంలో సమర్పించినట్లు సమాచారం. దీని వెనక జరిగిందేమిటో తెలుసుకోకుండా అధికారులు హడావుడిగా ఎన్నికలను వాయిదా వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల అధికారిగా ఉన్న డీసీవో(డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ ఆఫీసర్) ఏకపక్షంగా వ్యవహరించారని కొందరు సభ్యులు మండిపడుతున్నారు. తొలిసారి ఎన్నికలకు ముందు శాశ్వత సభ్యులందరికీ ఎన్నికలు ఉంటాయని, మీరంతా ఏజీఎం(వార్షిక సర్వసభ్య సమావేశానికి) రావాలని సమాచారం ఇచ్చారు. ఎన్నికలపై పత్రికల్లో ప్రకటనలు సైతం చేశారు. కానీ రెండోసారి ఎన్నికలు వాయిదా పడిన విషయం, ఎన్నికల నోటీసు విడుదల చేసిన విషయం సభ్యులెవ్వరికీ చెప్పలేదంటున్నారు. అది తెలిస్తే మరోసారి నామినేషన్లు వేసేవాళ్లమని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చాక నామినేషన్లు వేసిన 15 మంది ఏకగ్రీవం అయినట్లు ఇప్పటికే ప్రచారం చేసుకుంటుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో డీసీవో నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించారని ఆరోపిస్తున్నారు. దీనిపై డీసీవో నర్సయ్యను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ ఎత్తలేదు. రెడ్‌క్రాస్ సొసైటీకి బాధ్యులుగా ఉన్న కలెక్టర్ ఈ విషయాలను పరిశీలించి, అందరి సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నాకే ఎన్నికలు నిర్వహించాలని సభ్యులు కోరుతున్నారు. పీఎస్సార్ చెప్పారో లేదో తమకు తెలియదు కానీ.. సొసైటీలో కొందరు కాంగ్రెస్ నాయకులు పీఎస్సార్ జోక్యంతోనే ఎన్నికలు ఏకగ్రీవమవుతున్నాయని చెప్పారంటున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే పీఎస్సార్ సైతం క్లారిటీ ఇవ్వాలని, ఆయన పేరు చెప్పే సరికి తాము ఎటూ తేల్చుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా నడిచే సొసైటీలో ఇప్పటికైనా రాజకీయాలు చేయొద్దని వేడుకుంటున్నారు.