కాసిపేట, జూన్ 4 : కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్(అదానీ) కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై గురువారం ఆదిలాబాద్‌లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నది. కొన్ని నెలల క్రితమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఓరియంట్ సిమెం ట్ కంపెనీని అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. ఇన్నాళ్లు యాజమాన్యం మార్పు కొనసాగగా.. ఎన్నికలు వాయిదా వేశారు. ప్రస్తుతం ఆ పక్రియ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కార్మిక శాఖ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించింది.
కార్మిక సంఘాల నాయకులు జూన్ 5న ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని సమాచారాన్ని అందించారు. మెజార్టీ యూనియన్ల అభిప్రాయం మేరకు ఎన్నికలపై తుది నిర్ణయం వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఐదు యూనియన్లు పోటీ చేయడానికి అర్హత కలిగి ఉన్నాయి. ఎన్నికల తేదీలను ప్రకటిస్తారా లేదా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. గుర్తులు కేటాయించి, 266 మంది కార్మికుల ఓట్లపై చర్చించి.. ఓటర్ లిస్టును ఫైనల్ చేసి, ఎన్నికల తేదీని వాయిదా వేసే అవకాశం కూడా లేకపోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తారా స్థాయికి ఎన్నికల వేడి…
దేవాపూర్‌లో ఓరియంట్(అదానీ) గుర్తింపు సంఘం ఎన్నికల వేడి తారా స్థాయికి చేరింది. బరిలో నిలిచేవారంతా కాంగ్రెస్ వారే కావడంతో.. ఆ పార్టీలో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మాజీ వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు ముగ్గురు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్, వెడ్మ బొజ్జు ప్రకటించారు. ఇదిలా ఉండగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు సోదరుడు కొక్కిరాల సత్యపాల్ రావు పోటీకి దిగుతున్నారు.
సత్యపాల్‌రావు పార్టీలకు అతీతంగా పోటీ చేస్తానని ప్రకటించినప్పటికీ.. ఇక్కడ ఓ వర్గం సత్యపాల్రావుకు, మరో వర్గం విక్రంరావుకు మద్దతు ఇస్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ, గుర్తింపు సంఘం మాజీ అధ్యక్షుడు రాములు నాయక్ సైతం పోటీలో ఉంటున్నారు. వీరంతా కాంగ్రెస్ వారే కావడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. కార్మికులను తమ వైపు తిప్పుకునేందుకు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండు వర్గాలుగా చీలిన ఆదివాసీ సంఘాలు
యూనియన్ ఎన్నికల కారణంగా ఆదివాసీ సంఘాలు నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. గతంలో ఏ సమస్య ఉన్నా.. కలిసికట్టుగా చర్చించి నిర్ణయం తీసుకునే సంఘాల నాయకులు ఇప్పుడు విడిపోయి బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఓ వర్గం సత్యపాల్రావుకు, మరో వర్గం విక్రంరావుకు మద్దతు ఇస్తున్నారు. సుమారు 130 ఓట్లు ఆదివాసీలవే ఉంటాయని నాయకులు తెలిపారు.