కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఆదివాసీ జిల్లా ఆసిఫాబాద్‌లో వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలో రూ. 1000 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన తరగతులు ప్రారంభోత్సవానికి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి.. జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావ్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావు, జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణారావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కొనియాడారు. జిల్లాకో మెడికల్ కళాశాల ఉన్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు.
మారుమూల పల్లెల్లోని నిరుపేద విద్యార్థులు సైతం వైద్య విద్య చదివేందుకు ముఖ్యమంత్రి జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారని చెపుకొచ్చారు. ప్రభుత్వ దవాఖానల్లో నార్మల్ డెలివరీలు పెరిగాయని, ఇక్కడ కాన్పు అయిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వడంతో పాటు కేసీఆర్ కిట్లను అందిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేసి ఊహించని రీతిలో అభివృద్ధి చేసిందని, ఆ ఫలాలను ప్రజలు పొందుతున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంటింటికీ తాగు నీరు వచ్చిందని, పొలాలకు పుష్కలంగా నీరందుతున్నదని, పంటలకు గిట్టుబాటు ధర దొరుకుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నదన్నారు. రైతుబంధు, దళితబంధు, బీసీ బంధువంటి పథకాలతో ఆయా వర్గాల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నదని చెప్పారు. మండు వేసవిలో కూడా చెరువులు నీటితో కళకళాడుతున్నాయంటే అది సీఎం కేసీఆర్ చొరవేనని వివరించారు. పేద విద్యార్థుల చదువుల కోసం అనేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించారని, ఒక్కో విద్యార్థిపై యేటా రూ. లక్షా 20 వేలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో ఒకేసారి 9 మెడికల్ కళాశాలలను ప్రారంభించడం గొప్ప విషయమని, దేశ చరిత్రలో ఎన్నడూ చూసిందిలేదని చెప్పుకొచ్చారు. గతంలో బెంగళూరు ఐటీకి అగ్రగామిగా నిలిచిందని, ప్రస్తుతం మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ ఐటీలో అగ్రగామిగా వెలుగొందుతుందని కొనియాడారు. దేశంలో ఐటీ పేరు ఎత్తితే హైదరాబాదే గుర్తుకు వస్తుందని, 9 లక్షల మంది ఐటీలో పనిచేస్తున్నారని వివరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక దొంగ అని, బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని, ఆ పార్టీల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల రావడం గొప్ప విషయమని, గిరిజన జిల్లా నుంచి ఎంబీబీఎస్ డాక్టర్లను తయారు చేయడం అదృష్టమన్నారు. పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ అందించిన గొప్ప వరంగా భావిస్తున్నామన్నారు. కలెక్టర్ బోర్కడే హేమంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆసిఫాబాద్ మెడికల్ కళాశాలలో 100 మందికి సీట్లు కేటాయించిందని, అందరి సహకారంతో వైద్య కళాశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. సంబురాలు చేసుకున్నాయి. వివిధ మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నా యకులు జడ్పీ చైర్పర్సన్ ఇంటి నుంచి మెడికల్ కళాశాల వరకు భారీ బైక్ ర్యాలీ తీశారు. గుస్సాడీ నృత్యాలతో మల్లారెడ్డికి స్వాగతం పలికారు. మంత్రి మల్లారెడ్డి ఓపెన్‌టాప్ జీప్, బైక్ ఎక్కి విజయ సంకేతం చూపుతూ ముందుకు సాగారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో ఆసిఫాబాద్ పట్టణం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ, సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 15 : నేను గొర్రెలు పెంచుకుంటున్న. మాది మంచిర్యాల జిల్లాలోని రేచిని గ్రామం. నాకు ఇద్దరు కొడుకులు. చిన్నోడు ఐటీఐ చేస్తున్నడు. పెద్దోడు కుమార్‌కు ఇక్కడ ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది. కొత్త కళాశాల ఏర్పాటు చేయడంతో నిరుపేద బిడ్డకు డాక్టర్ చదువుకునే అవకాశం వచ్చింది. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది.
– మిదిగిరి బీరమళ్లు, రెచీని, మంచిర్యాల
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 15 : గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకశాశాలలో నాకు సీటు వచ్చింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని నా కోరిక.పెద్ద పెద్ద పట్టణాల్లో చదువుకుంటే సమస్యలపై అంతగా అవగాహన ఉండదు. ఇలాంటి చోట చదువుకుంటేనే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఈ ప్రాంత ఆదివాసీ ప్రజలకు వైద్యం అందిస్తా.
– పుప్పాల సాత్విక,మీయాపూర్,హైదరాబాద్
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 15 : ప్రభుత్వం కొత్తగా కళాశాలలు ఏర్పాటు చేయడంతో మాలాంటి పేదలకు వైద్య విద్య చదువుకునే అవకాశం వచ్చింది. రాష్ట్రంలో 85 శాతం రిజర్వేషన్ కల్పించడంతో తెలంగాణ బిడ్డలకు వైద్యవిద్యలో సీట్లు దక్కాయి. నాకు ఇక్కడ సీటు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ పూర్తి చేస్తా.
– సహస్ర, మహబూబ్‌నగర్
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 15 : మాది రాజస్థాన్. నేను నవోదయ విద్యాలయంలో చదువుకున్నా. ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షల్లో 487 మార్కులు వచ్చాయి. ఇక్కడి కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కొత్తగా కళాశాలలు ఏర్పాటు చేయకపోతే ఈ ఏడాది వైద్యవిద్యకు దూరమయ్యేవాడిని. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నది.
– లక్ష్మీనారాయణ, రాజస్థాన్