నార్నూర్, ఆగస్టు 7 : వర్షాకాలంలో వాగు సమీపంలోని గ్రామాలకు వెళ్లాలంటే స్థానికులతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సాహసం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ గ్రామ సమీపంలోని వాగుల్లో నిత్యం నీరు ప్రవహిస్తున్నది. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వాగుల వద్ద నిరీక్షించాల్సి వస్తున్నది. ఇక్కడి గ్రామస్తుల పరిస్థితి ఆగమ్య గోచారంగా మారింది. అత్యవసర సమయంలో కనీసం ఆంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు కురిస్తే ప్రజలు బయట ప్రపంచానికి దూరంగా ఉంటారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మలంగి పంచాయతీ పరిధిలోని బారికరావు గూడ గ్రామంలో గాదిగూడ మండలంలోని ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది వాగు దాటి గురువారం వైద్య సేవలు అందించారు. కనీసం ఆ గ్రామానికి వాహనం వెళ్లలేని పరిస్థితులలో కాలినడకన వెళ్లి వైద్య శిబిరం ఏర్పాటు చేసి స్థానికులకు వైద్యం అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎస్ ఆడే సంజయ్, వైద్య సిబ్బంది చంద్రకళ, వినోద్, ఆశా కార్యకర్తలు ఆ కార్యకర్తలు మొత్తుబాయి, మొతుబాయి, లక్ష్మీబాయి ఉన్నారు.