నస్పూర్, అక్టోబర్ 14 : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం సెంటర్ ఫర్ రూరల్ మేనేజ్మెంట్ నేషనల్ లెవల్ మానిటర్స్ సభ్యులు బాల మురళి, సునీల్, డీఆర్డీవో కిషన్, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తంనాయక్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.
250 మంది జనాభా కంటే అధికంగా ఉన్న గ్రామాల నుంచి మండల కేంద్రానికి అనుసంధానమయ్యే బీటీ రోడ్లు, మరమ్మతు వివరాలతో నిబంధనలకు లోబడి నివేదిక అందించాలని ఆదేశించారు. పింఛన్, భూగర్భ జల, వంతెనలు, సెగ్రిగేషన్ షెడ్లతో పాటు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇతర ప్రజా ప్రయోజనకర పనులను వేగవంతం చేయాలని సూచించారు.
సెంటర్ ఫర్ రూరల్ మేనేజ్మెంట్ నేషనల్ లెవల్ మానిటర్స్ సభ్యులు 15 నుంచి 19వ తేదీ వరకు జిల్లాలోని 4 మండలాల్లో ఎంపిక చేసిన 10 గ్రామపంచాయతీల్లో పర్యటిస్తారని తెలిపారు. గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తారని, వాటి వివరాలను తెలుసుకుంటారని పేర్కొన్నారు. మానిటర్స్ సభ్యులు గ్రామాల్లో పర్యటించే సమాచారాన్ని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న పనుల పురోగతి వివరాలను ఫొటోగ్రాఫ్‌తో కలిసి కేంద్రానికి సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
కాసిపేట, అక్టోబర్ 14 : తాజా మాజీ సర్పంచుల కాలంలో పని చేసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు సపాట్ శంకర్ కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్‌కు కాసిపేట మండలం సోమగూడెం(కే) తాజా మాజీ సర్పంచ్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు సపాట్ శంకర్ వినతిపత్రం అందించారు. 311 జీపీల్లో గతంలో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు.
పీసా గ్రామ సభలతోనే ఎంపిక చేయాలి
కాసిపేట, అక్టోబర్ 14 : పీసా గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదివాసీ సేన కాసిపేట మండలాధ్యక్షుడు మడావి వెంకటేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పెంద్రం శంకర్ కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అలాగే కాసిపేట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీవో సఫ్దర్ అలీకి వినతి పత్రం అందించారు. 5వ షెడ్యూల్ ప్రాంత పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు విషయంలో పీసా చట్టం నిబంధనలు పాటించకుండా జారీ చేసిన జీవో 33ను ఏజెన్సీ ప్రాంతంలో నిలిపివేయాలని, నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక పీసా గ్రామ సభల ద్వారా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.