తాంసి : మండలంలోని వడ్డాడి వద్ద నిర్మించిన మత్తడి వాగు ( Mattadi Project ) ప్రాజెక్టు భారీ వర్షాల కారణంగా తిరిగి జలకళ సంతరించుకుంది. ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోయిన ప్రాజెక్టులో ఇటీవల కురుస్తున్న వర్షాల ప్రభావంతో వరద నీరు చేరి ప్రాజెక్టు వద్ద మరోసారి రమణీయమైన వాతావరణం నెలకొంది. ప్రాజెక్టు అధికారిక సమాచారం ప్రకారం, పూర్తి స్థాయి నీటిమట్టం 277.50 మీటర్లకు గాను, ప్రస్తుతం 276.20 మీటర్లకు చేరుకుందని ప్రాజెక్ట్ అధికారి హరీష్ కుమార్( Harish Kumar ) తెలిపారు.
ఈ ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం మొత్తం 0.571 టీఎంసీలకు ప్రస్తుతం 0.320 టీఎంసీలు నీరు నిల్వ ఉందని వెల్లడించారు. గత 24 గంటల్లోనే 860 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి ప్రవహించిందని, ప్రస్తుతం 80 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోందని వివరించారు. ఈ నీటి లభ్యత వల్ల తాంసి మండలంలోని వడ్డాడి, హస్నాపూర్,జామిడి, బండల్ నాగపూర్ వంటి గ్రామాలకు సాగునీరు అందే అవకాశం ఉందని వెల్లడించారు.