మంచిర్యాల, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్‌లోని శనిగకుంట మత్తడిని సింగరేణి బాంబులతోనే పేల్చివేసినట్లు జోరుగా చర్చ సాగుతున్నది. మందమర్రి ఏరియాలో ఆర్కే ఓసీపీలో ఎక్స్‌ఫ్లోజివ్ మ్యాగ్జిన్‌లో నుంచి ఈ పేలుడు పదార్థాలు సరఫరా అయినట్లు సమాచారముండగా, ఇప్పుడు ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. శనిగకుంట కేసులో కీలక సూత్రధారులుగా ఉన్న హస్తం పార్టీ లీడర్ల బంధువు ఒకరు ఆర్కే ఓసీపీలో పనిచేస్తున్నారు.
ఎంకే-4 బరాక్‌లో మేనేజర్‌గా ఉన్న ఆ వ్యక్తి నుంచే పేలుడు పదార్థాలు బయటకు వచ్చాయని విశ్వసనీయంగా తెలిసింది. అందుకే శనివారం రాత్రి వరకు ఈ కేసులో అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ లీడర్లు బాపురెడ్డి, పెద్దింటి శ్రీనివాస్ సహా పోలీసులు పరారీలో ఉన్నట్లు చెబుతున్న మరో లీడర్ బత్తుల సమ్మయ్యను ఈ కేసు నుంచి తప్పించాలని పట్టుబట్టిన సదరు లీడర్ సైలెంట్ అవ్వడానికి కూడా ఇదే కారణమని తెలిసింది. నిన్న కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టి, ఈ విషయంలో దిగిరాకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ హడలెత్తించిన వారంతా ప్రస్తుతం కిమ్మనకుండా ఉంటున్నారు.
ఎమ్మెల్యే ఆదేశాలంటూ ఆదివారం అభివృద్ధి పనులను పరిశీలించడంలో బిజీ అయ్యారు. ఒక్క రాత్రిలో ఇంత మార్పు ఎందుకు వచ్చిదంటే.. ఈ బాంబుల వ్యవహారం బయటికి రావడంతోననే సమాచారముంది. పోలీసులు మాత్రం దీన్ని అధికారికంగా నిర్ధారించలేదు. అసలు సింగరేణి నుంచి పేలుడు పదార్థాలు బయటికి రావు. ఎక్స్‌ఫ్లోజివ్ మ్యాగ్జిన్ అనేది పోలీసుల భద్రతలో ఉంటుంది. సింగరేణి వారు ఏం తెచ్చినా అది రికార్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నప్పటికీ ఓసీపీ నుంచి ఆ పేలుడు పదార్థాలు బయటికి వచ్చాయంటే.. ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించడం లేదని తెలుస్తున్నది. ఆ కోణంలో విచారణ కొనసాగిస్తున్నామని మాత్రమే చెబుతున్నారు.
ఇద్దరి అరెస్టు.. వివరాలు గోప్యం..
శనిగకుంట చెరువు బఫర్‌జోన్‌లో మట్టిపోసిన రియ ల్ ఎస్టేట్ వ్యాపారులు, నాయకులను అరెస్టు చేయడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు శుక్రవారమే ప్రయ త్నం చేయగా, ఈ కేసుతో సంబంధమున్న 10 మంది లో కొందరు పారిపోయారు. దీంతో పోలీసులు శుక్రవా రం అదుపులోకి తీసుకున్న వారిని విచారించి, అనుమ తి లేకుండా బయటికి వెళ్లకూడదనే పూచీకత్తుపై వదిలివేశారు.
కాగా, ఈ కేసులో కీలకంగా ఉన్న మరో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బత్తుల సమ్మయ్య, చె న్నూర్ మున్సిపల్ చైర్పర్సన్ భర్త రాంలాల్ గిల్డాను శనివారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని గుల్బర్గాలో పట్టుకున్న ట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రోజు ఆదివారం కావడంతో వారిని అక్కడే ఉంచారని, సోమవారం ఇక్కడికి తీసుకువస్తారని తెలిసింది. వారు అరస్టైన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ కేసులో జోక్యం ఉన్న అధికార పార్టీ లీడర్లతో పాటు ఇతర పార్టీల నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను అరెస్టు చేస్తారని తెలిసింది.