జైనూర్, ఆగస్టు 24 : ఐఐఐటీలో ఆలిండియా ర్యాంకు సాధించిన ఆదివాసీ బిడ్డను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. రాయ్‌పూర్‌లో సీటు రాగా, చదువు కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది. దయామయులైవరైనా ఆదుకోకపోతారా అంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాడు. సిర్పూర్ (యు) మండలం పుల్లారా గ్రామ పంచాయతీ పరిధిలోని తుమ్మగూడ గ్రామానికి చెందిన మర్సకోల సాకృబాయి-బాదీరావ్ దంపతుల కుమారుడు కృష్ణకు చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి.
జైనూర్ మండలం పోచ్చంలొద్ది ఆశ్రమ పాఠశాలలో విద్యనభ్యసించిన ఆయన, పదో తరగతి మంచి మార్కులతో పాసయ్యాడు. ఇచ్చోడలోని ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. జేఈఈ మెయిన్స్ రాయగా, ఇటీవల ఫలితాలు వెలువడ్డాయి. ఆలిండియా స్థాయిలో 7456 ర్యాంకు సాధించాడు. కర్ణాటకలోని రాయ్‌పూర్ ఐఐఐటీలో ఎస్టీ కోటాలో సీటు సంపాదించాడు. బీటెక్ మ్యాథ్స్(కంప్యూటర్) నాలుగేళ్ల కోర్సు చేయాల్సి ఉంది.
ట్యూషన్, హాస్టల్, సెమిస్టర్ తదితర ఫీజులు కలిపి మొత్తం రూ. 12 లక్షల దాకా అవుతుంది. కుటుంబం గడవడమే కష్టంగా ఉండగా, అంత డబ్బు కట్టేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆర్థికసాయం కోసం ఐటీడీఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ప్రసుతం (సెప్టెంబర్ ఒకటిలోగా) రూ. 2.19 లక్షలు చెల్లించాల్సి ఉందని, దాతలెవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. ఫోన్‌పే, గూగుల్ పే నం. 9347983284 (బాబాయి మాణిక్‌రావు) కసాయమందించాలని కోరుతున్నాడు.