ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/ఇంద్రవెల్లి, అక్టోబర్ 6 : ఆదిలాబాద్ జిల్లావాసుల్లో ఇండ్ల కూల్చివేత భయం పట్టుకున్నది. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో అధికారులు మార్కింగ్ చేయడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌లో హైడ్రా తరహాలో తమ ఇండ్లను కూల్చివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందంటూ ఆందోళన చేపట్టారు. తాము ఇండ్లను కూల్చమంటూ, చెరువును రక్షించడానికి ఇకపై నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నా బెంబేలెత్తిపోతున్నారు. ఇందులో భాగంగానే ఇండ్ల మార్కింగ్ చేస్తున్నామని అధికారులు తెలిపినా భయం వీడడం లేదు. పోలీసులతో కలిసి మార్కింగ్‌కు ఖానాపూర్ ఏరియాకు వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకోగా.. మార్కింగ్ చేయకుండా వెనుదిరిగారు. నాలుగు రోజుల నుంచి ఖానాపూర్ చెరువు పరిసరాల్లో అధికారులు వెళ్లకపోవడంతో మార్కింగ్‌లు నిలిచిపోయాయి.
ఇంద్రవెల్లిలో రెండు భవనాలు కూల్చివేత
ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పంచాయతీ అధికారులు నిర్మాణంలో ఉన్న రెండు భవనాలను కూల్చి వేశారు. మార్కెట్ యార్డు సమీపంలోని ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న భవనంతోపాటు అనుమతులు లేని మరో భవన పిల్లర్లను పడగొట్టారు. భవనాల కూల్చివేతను నిరసిస్తూ స్థానికులు మార్కెట్ బంద్ పాటించి ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు భారీ సంఖ్యలో బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎన్నో సంవత్సరాలకు ఇక్కడ నివాసం ఉంటున్నామని, ఇండ్ల కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేశారు. ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ వారికి నచ్చచెప్పడంతో వివాదం సద్దు మణిగింది.
అంబేద్కర్ చౌక్‌లో రిలే నిరాహార దీక్షలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం అమలు కంటే ముందు నుంచి నివాసం ఉంటున్న గిరిజనేతరులకు ప్రభుత్వం రక్షణ కల్పించి, సమస్యలను పరిష్కరించాలని గిరిజనేతరుల సంఘం, గిరిజనేతరుల ఐక్య వేదిక జిల్లా నాయకులు జాడే నాగోరావ్, మారుతి పటేల్ డోంగ్రే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఇంద్రవెల్లి మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో గిరిజనేతరుల సంఘం, గిరిజనేతరుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1/70 చట్టాలను కాపాడుతూనే ఆదివాసీ గిరిజనుల చట్టాలు, హక్కులకు రక్షణ కల్పించి, గిరిజనేతరులను అన్ని విధాలా ఆదుకోవాలని విన్నవించారు. ప్రభుత్వ భూముల పేరిట అనుమతులు లేవని ఇండ్లను అధికారులు కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏజెన్సీలోని గిరిజనేతరులను ప్రభుత్వం అన్ని విధాలు అదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజనేతర సంఘం నాయకులు ఎండీ మసూద్, సంజయ్ లహనే, మిర్జా జిలానీ బేగ్, కేశవ్ ముస్లే, బాబు ముండే, ఫడ్ ప్రకాశ్, దేవ్‌పూజె మారుతి, దిలీప్మోరే, ఆచార్యే దత్తా, సూరజ్, మారుతి మహారాజ్, పరత్వాగ్ దత్తా, సత్యానంద్, అశోక్, గన్యాన్సింగ్, నారాయణసింగ్, విశ్వనాథ్ ఫడ్, నిత్తుసింగ్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి మార్కెట్ బంద్
ఇంద్రవెల్లి మార్కెట్‌ను గిరిజనేతరులు, వ్యాపారస్తలు బంద్ పాటించారు. ఆదివారం మండలకేంద్రానికి చెందిన వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను బంద్ చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉట్నూర్ సీఐ మొగిలి, ఇంద్రవెల్లి ఎస్ఐ సునీల్ బందోబస్తుపై ఆరా తీశారు. పోలీస్ స్టేషన్లో గిరిజనేతరుల సంఘం పెద్దలతో ఉట్నూర్ సీఐ పలు అంశాలపై చర్చించారు.