కాసిపేట, ఆగస్టు 25 : వివిధ కారణాలతో చదువు ఆపేసిన, బడి మానేసిన వారికి తెలంగాణ ఓపెన్ సూల్ సొసైటీ (టాస్) వరంగా మారింది. వృత్తి పరంగా పనులు చేసుకుంటూనే ఓపెన్ స్కూల్లో సెలవు రోజుల్లో చదువుకునే వెసలుబాటు ఉంది. ఓపెన్ స్కూల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యతో ఒకేషనల్ కోర్సులను అభ్యసించవచ్చు. ప్రస్తుతం ఓపెన్ ఇంటర్, టెన్త్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అడ్మిషన్ల పక్రియ సాగుతున్నది. మంచిర్యాల జిల్లాలో 20 స్టడీ సెంటర్లు, ఆదిలాబాద్ జిల్లాలో 22, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 17, నిర్మల్ జిల్లాలో 25, ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 84 స్టడీ సెంటర్లున్నాయి. గతేడాది 2023-24 విద్యా సంవత్సరానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో టెన్త్‌లో 678, ఇంటర్లో 365, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టెన్త్‌లో 369, ఇంటర్లో 225, మంచిర్యాల జిల్లాలో టెన్త్‌లో 711, ఇంటర్లో 1190, నిర్మల్ జిల్లాలో టెన్త్‌లో 768, ఇంటర్లో 485 అడ్మిషన్లు పొందారు. ఈ ఏడాది పదో తరగతిలో 3000, ఇంటర్లో 3500 అడ్మిషన్లు తీసుకునే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
అడ్మిషన్ల అర్హత, దరఖాస్తు విధానం…
ఓపెన్ స్కూల్లో పదో తరగతి చదివేందుకు 14 ఏళ్లు నిండి ఉండాలి. బర్త్ సర్టిఫికెట్ లేదా బడి మధ్యలో మానేస్తే అప్పటి ట్రాన్సఫర్ సర్టిఫికెట్(టీసీ), రికార్డ్ షీటు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రంతో ప్రవేశం పొందవచ్చు. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించడం, సబ్జెక్టుకు సంబంధించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాఠాలు బోధిస్తారు. పదో తరగతికి తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాలు అందుబాటులో ఉన్నాయి.
ఇంటర్ చదవాలనుకునే వారు పదో తరగతి పూర్తి చేసి, 15 ఏళ్లు నిండినవారందరూ అభ్యసించవచ్చు. పదో తరగతి మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, ఫొటోలతో దరఖాస్తు చేసుకోవచ్చు. కళాశాల చదువు మానేసిన, ఇంటర్లో ఫెయిలైన వారికి మంచి అవకాశం. ఇంటర్లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాలు అందుబాటులో ఉన్నాయి. గ్రూపు- ఏలో భాషలు, గ్రూపు-బీలో ఆప్షనల్స్, గ్రూపు-సీలో విద్యాకోర్సులుంటాయి. సీఈసీ, బైపీసీ, హెచ్ఈసీ, ఎంఈసీ, ఎంపీసీ తదితర గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులో అభ్యాసకులు వృత్తి విద్యా కోర్సును ఒక ఐచ్చిక సబ్జెక్టు(గ్రూప్ సీ)గా ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్ గతంలో చదవి ఫెయిలై ఉంటే ఒరిజినల్ ఫెయిల్ మెమోతో టీవోసీ ద్వారా దరఖాస్తులు చేసుకుంటే రెండు సబ్జెక్టులు మినహాయించే విధానం కూడా ఉంది. అడ్మిషన్ పొందిన అనంతరం ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తారు.
అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు తేదీల వివరాలు..
ఓపెన్ సూల్లో చేరాలనుకునే వారు www.telanganaopenschool.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవ, ఆన్లైన్ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి టాస్ ద్వారా ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. ఉ న్నత విద్య, ఉద్యోగాలకు వినియోగించుకోవ చ్చు. ఆసక్తి గల వారు సెప్టెంబర్ 10వ తేదీ లో గా ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశముంది. పదో తరగతికి రూ.100, ఇంటర్‌కు రూ.200 ఫైన్‌తో సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు అవకాశముంది.
మీ సేవ, ఆన్లైన్లో మీరు కోరుకున్న అధ్యయన కేంద్రాన్ని ఎంచుకొని, ఆన్లైన్లో దరఖాస్తుతో పాటు ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి. ఆన్లైన్ చేసే క్రమంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చెల్లించిన ఫీజు రశీదు, అడ్మిషన్ దరఖాస్తులతో పాటు సర్టిఫికెట్లు, ఫొటోలను జత చేసి, మూడు సెట్ల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ సంతకాలు చేయించి మీరు కోరుకున్న అధ్యయన కేంద్రంలో అప్పగించాలి. అక్కడి అధ్యయన కేంద్రం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ స్థాయి ఓపెన్ స్కూల్ కేంద్రానికి ఆ దరఖాస్తులను పంపిస్తారు. అనంతరం డీఈవోతో నియమించిన అడ్మిషన్ కమిటీ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, అర్హులకు అవకాశం కల్పిస్తారు.
టెన్త్, ఇంటర్ అడ్మిషన్ ఫీజు వివరాలు…
ఓపెన్ ఇంటర్, టెన్త్ పూర్తిగా ఆన్లైన్లోనే అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీ సేవ, ఆన్ లైన్ కేంద్రాల్లో చెల్లించాలి. అధ్యయన కేంద్రంలో ఎలాంటి చెల్లింపులు ఉండ వు. పదో తరగతికి అడ్మిషన్ ఫీజు ఓసీ పురుషులకు రూ.1400, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పురుషులకు, మహిళలకు రూ.1000, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.150, ఆఫ్‌లైన్ చార్జీలు అదనంగా ఉంటాయి. ఇంటర్‌కు ఓసీ పురుషులకు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పురుషులు, మహిళలకు రూ.1200, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300, ఆఫ్‌లైన్ చార్జీలు అదనంగా ఉంటాయి.
అందరికీ అందుబాటులో విద్య..
అందరికీ అందుబాటులో విద్య అందించే లక్ష్యంతో ఓపెన్ స్కూల్ విధానం కొనసాగుతుంది. ఓపెన్ టెన్త్, ఇంటర్ పూర్తి చేసుకున్న వారికి రెగ్యులర్ విద్యతో సమానంగా గుర్తింపు ఉంటుంది. ఉన్నత విద్య, పదోన్నతులు, ఉద్యోగాలు పొందడానికి, మధ్యలో మానేసిన వారికి, గృహిణిలు, వయోజనులకు ఎంతో ఉపయోగం ఉంటుంది. అడ్మిషన్ పొందిన ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తారు. చాలా మంది ఉద్యోగాలు సాధించడంతో పాటు పై చదువులు చదువుకునేందుకు దోహద పడింది. అందరూ చదువుకోవాలనే లక్ష్యంతో అందరికీ అవగాహాన కల్పిస్తూ విస్త్రత ప్రచారం చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అడ్మిషన్లు చేస్తున్నాం. ఓపెన్ స్కూల్ డైరెక్టర్ పీవీ శ్రీహరి ఆధ్వర్యంలో మెరుగైన విద్య అందిస్తున్నాం. ఓపెన్ స్కూల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్‌కు పునాది వేసుకోవాలి.
– నాగుల అశోక్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్