కాసిపేట, నవంబర్ 21 : మామిడిగూడెం జ్వరాలతో మంచం పట్టింది. వారం రోజులుగా వైరల్ ఫీవర్లు విజృంభిస్తుండగా, గిరిజనం అవస్థలు పడుతున్నది. రోజు రోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. ఏ వాడలో చూసినా జ్వర పీడుతులే కనిపించడం ఆందోళనకు గురిచేస్తున్నది. కీళ్ల నొప్పులతో లేచి నడవలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 20 మందికి పైగా బాధపడుతుండగా, మరి కొందరు దవాఖానల పాలయ్యారు. గ్రామంలో పారిశుధ్యం పడకేయడం వల్లే జ్వరాలు ప్రబలాయని గ్రామస్తు లు పేర్కొంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం దర్శనమిస్తుండగా, డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోయి మురుగు నీరంతా రోడ్లపై పారుతున్నది.
దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇక దోమలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వం వైద్య సేవలు అందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. ఇక ఆర్థిక స్థోమత లేని వారు స్థానికంగా ఉండే ఆర్ఎంపీల వద్దకు వెళ్లి గోలీలు తెచ్చుకొని వేసుకుంటున్నారు. గ్రామంలోని పరిస్థితిని వివరిస్తూ అధికారులకు ఫొటోలతో సహా పంపించినా పట్టించుకున్న పాపాన పోలేదని అడవిబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా స్పందించి పారిశుధ్యంపై దృష్టి సారించడమేగాక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వారు వేడుకుంటున్నారు.