మంచిర్యాల, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదివాసీ మహిళపై జరిగిన దాడి నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో చోటు చేసుకున్న పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకొస్తున్నా రు. కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో పాటు అడిషనల్ డీజీ(లాఅండ్ఆర్డర్) మహేశ్ భగవత్, నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం, బాలానగర్ డీసీపీ(ఆసిఫాబాద్ పాత ఎస్పీ) సురేశ్‌కుమార్ జైనూర్లోనూ ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
దాదాపు 1000 మంది ప్రత్యేక పోలీసు బలగాలతో జైనూర్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జైనూర్‌లో 48 గంటలు, ఏజెన్సీ మండలాలైన ఇంద్రవెల్లి, నార్నూర్, ఉట్నూర్, గాదిగూడ మండలాల్లోనూ 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. జైనూర్లోని ఎంపీడీవో సమావేశ మందిరంలో గురువారం పెద్దలు, నాయకులు, అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
అందరూ సంయమనం పాటించాలి
– అదనపు డీజీ మహేశ్ భగవత్, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆదివాసీ మహిళపై దాడి జరగడం బాధాకరమని, ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అదనపు డీజీ మహేశ్ భగవత్, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేశారు. బాధిత కటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని, వైద్య ఖర్చులను భరిస్తుందన్నారు. జైనూర్ ఘటనలో జరిగిన ఆస్తి నష్టంపై పూర్తిస్థాయి నివేదిక అందించేందుకు కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించామన్నారు.