మంచిర్యాలటౌన్, అక్టోబర్ 29 : బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా ఉన్నదని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. ఇంటిం టా బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం మంచిర్యాల పట్టణంలోని మూడో వార్డు తిలక్‌నగర్, సూర్యనగర్లలో ఆయన ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరుగుతూ వివరించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అమలు కావాలంటే నవంబర్ 30న జరిగే పోలింగ్‌లో కారుగుర్తుకే ఓటువేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో వచ్చీపోయే టూరిస్టుల మాటలు నమ్మిమోసపోవద్దని, నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న వారికే ఓటువేయాలని కోరారు. ప్రశాంతంగా ఉన్న మంచిర్యాలలో రౌడీయిజానికి చోటు లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీపతివాసు, కర్రు శంకర్, గరిగంటి సరోజ పాల్గొన్నారు.