Mancherial | మంచిర్యాలటౌన్, అక్టోబర్ 3 : ‘ఆక్రమణల పేరిట మా షాపుల ముందున్న రేకుల షెడ్లు, స్లాబులు తదితర వాటిని కూల్చివేస్తున్నరు. కొనేటోళ్లను షాపుల్లోకి రాకుంట చేసిన్రు. గీ దసరాకే నాలుగు రూపాలు దొరుకుతాయే.. ఇంకొన్ని రోజులు ఆగితే అయిపోవు కదా. పండుగ పూట మా పొట్టగొడుతారా’ అంటూ మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం స్థానిక మార్కెట్ ఏరియాలోగల ఆక్రమణలను మున్సిపల్ అధికారులు, సిబ్బంది తొలగించారు. ఉదయం నుంచి మొదలైన ఆక్రమణల తొలగింపు ప్రక్రియ సాయంత్రం దాకా కొనసాగింది. మార్కెట్ ఏరియాలోని వ్యాపారులు చాలా వరకు తమ దుకాణాల గదులను వదిలి.. ముందుకు రోడ్డు పైకి వచ్చి వ్యాపారాలు సాగిస్తున్నారు. దుకాణాల ముందు రేకుల షెడ్లు, స్లాబులు వేయడం, తోపుడుబండ్లను ఏర్పాటు చేయడం వల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడుతుంది.
మార్కెట్ రోడ్డులో వ్యాపారులు ఇరుపక్కలా ముందుకు రావడంతో రోడ్డు ఇరుకుగా మారిపోయింది. దీనికి తోడు రోడ్డుకు మధ్యలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఆక్రమణల తొలగింపు ఒక్కటే మార్గమని భావించిన అధికారులు ముందస్తుగా వ్యా పారులకు సమాచారం అందించారు. అయినా వారి నుంచి స్పందన లేకపోవడంతో మున్సిపల్ అధికారులు జేసీబీ సాయంతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. పలుచోట్ల వ్యాపారులు వారికి వారే ముం దుకు నిర్మించిన ఆక్రమణలను తొలగించారు. కాగా, దసరా పండుగ వేళ ఇలా కూల్చివేతలు చేపట్టడం సరికాదని, ఇంకొంత సమయం ఇస్తే బాగుండేదని వ్యాపారులు ఆవేదన.. అసహనం వ్యక్తం చేశారు.
పరిశీలించిన ఎమ్మెల్యే పీఎస్సార్
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 3 : మార్కెట్లో చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చి వేతలను ఎమ్మెల్యే పీఎస్సార్ పరిశీలించారు. వ్యాపారస్తులతో మాట్లాడారు. మున్సిపల్ శాఖ అధికారులు, పోలీసులకు ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు ఉన్నారు.
వ్యాపారుల పొట్టగొట్టడమే
మంచిర్యాల (ఏసీసీ), సెప్టెంబర్ 22 : రాత్రికి రాత్రే మార్కింగులు చేసి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వ్యాపార సముదాయాలను కూల్చడం సరికాదు. దసరా, దీపావలి పండుగల సందర్భంగా కూల్చి వేతలు చేపట్టడం అంటే వ్యాపారస్తుల పొట్టకొట్టడమే అవుతుంది. మార్కెట్ ఏరియాలో పేద, మధ్యతరగతి కుటుంబాలు జీవనోపాధి పొందుతుంటే అక్రమ కట్టడాల పేరిట కూల్చివేతలు చేపట్టడం సరికాదు. ఇది శాడిస్టు తనమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదని వ్యాపారస్తులను టార్గెట్ చేయడం మూర్ఖత్వమే.
– రఘునాథ వెరబెల్లి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
కూల్చివేతలు సరికాదు
దుకాణాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పండుగవేళ దుకాణాల్లోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే వ్యాపారులు గిరాకీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. ప్రజలు, వ్యాపారులు ఆలోచించాలి. అడ్డువస్తే, ఎదురు మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాదు. రాష్ట్రంలో, దేశంలో ఎంతోమంది నాయకులను చూశాం. కానీ మంచిర్యాలకు ఇలాంటి వ్యక్తిరావడం, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే మనిషి రావడం బాధాకరం. అందరూ ఆలోచించాలి. ఎంతటి పగవాడికైనా ఇలాంటి బాధ రావద్దు.
– నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే