మంచిర్యాల : రాష్ట్ర స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌కు జిల్లాలోని వెల్గనూర్ విద్యార్థులు ఎంపికయ్యారు. గత సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో భాగంగా.. ఈ విద్యా సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి దాదాపు 11 వేల ఆలోచనలు విద్యార్థుల ద్వారా నమోదయ్యాయి. వాటిలో నుంచి ఫైనల్ గా 20 అత్యుత్తమ ఆలోచనల ప్రాజెక్ట్స్‌ను రాష్ట్రస్థాయి బూట్ క్యాంపు ప్రదర్శనకు ఎంపిక చేశారు.
ఉమ్మడి జిల్లా నుంచి మంచిర్యాల జిల్లా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, వెల్గనూర్ విద్యార్థులు వినయ్ వర్మ టీం తయారుచేసిన ‘మైజే ఆన్ హీట్’ అనే పరికరం ఎంపికైందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాస్థాయి బూట్ క్యాంపునకు 87 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 9 ప్రాజెక్ట్స్ ఎంపికయ్యాయి. రాష్ట్ర స్థాయి స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ఎంపికవడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థులను, గైడ్ ఉపాధ్యాయులు వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయురాలు గాయత్రిని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు అభినందించారు.