కాసిపేట, డిసెంబర్ 2 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నేత కల్వల శరత్ బీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వల శరత్ సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ అభివృద్ధికి అందరు కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రామచందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతల భీమయ్య, గ్రామ అధ్యక్షులు వెల్ది శ్రావణ్, వంశీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.