కాసిపేట, ఫిబ్రవరి 3 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల, రేగులగూడ ఆశ్రమ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పాఠశాలకు మంజూరైన భోజనశాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రేగులగూడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి పాఠశాలకు మంజూరైన అదనపు గదుల నిర్మాణ ప్రక్రియను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.