చెన్నూర్, జనవరి 31 : ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సాయం కోరి వచ్చే వారికి ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నారు. సీఎంఆర్ఎఫ్తో పాటు బీఆర్ఎస్ బీమా పథకం ద్వారా ఆర్థికసాయమందించి భరోసానిస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయమందిస్తున్నారు. అనారోగ్యంతో దవాఖానలో చేరామని, ఆపదలో ఉన్నాం.. ఆదుకోవాలని వచ్చే వారిని అక్కున చేర్చుకుంటున్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్వోసీలు అందజేసి వారికి చేయూతనిస్తున్నారు. ఇప్పటి వరకు చెన్నూర్ నియోజకవర్గంలో 2,534 మంది అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందగా, వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 10,47,78,103 సహాయం అందజేశారు. అలాగే 194 మందికి ఎల్వోసీ ద్వారా రూ. 4,04,51,000 పంపిణీ చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం కలిగి వివిధ ప్రమాదాల్లో మరణించిన 22 మంది కార్యకర్తలకు ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున రూ 44,00,000 అందించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఆర్థిక సాయమందించిన నియోజకవర్గంగా చెన్నూర్ ప్రథమ స్థానంలో నిలిచింది. మరోవైపు బాల్క ఫౌండేషన్ ద్వారా ఎందరో నిరుపేదలకు లక్షల్లో సాయమందించి మానవత్వాన్ని చాటుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటా
నా భార్య పోసక్క పదేళ్లుగా బీ(టీ)ఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా పనిచేసింది. గ్రామంలోని మహిళలంతా బీఆర్ఆస్లో చేరడానికి కృషి చేసింది. సభలు, సమావేశాలకు మందిని పోగేసి తీసుకెళ్లేది. ఇటీవల భీమారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నా భార్య మృతి చెందింది. ఆమె ఉన్నపుడు ఇద్దరం కలిసి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాం. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సహకారంతో బీమా పథకం కింద రూ. 2 లక్షలు అందించారు. నిరుపేద కుటుంబం మాది. మాకు ఇద్దరు కూతుళ్లు. ఇటీవల పెద్ద కూతురుకు వివాహమైంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన రూ. 2 లక్షలు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. బతికున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటా. – మాను తిరుపతి, పొన్నారం
నా కొడుకు చనిపోతే రూ.2 లక్షలిచ్చారు
నా కొడుకు బిల్కి సందీప్ బీ(టీ)ఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చేశాడు. పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేశాడు. ఇటీవల ట్రాక్టర్ ప్రమాదంలో నా కుమారుడు మరణించాడు. దీంతో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పార్టీ తరుపున రూ. 2 లక్షల బీమా చెక్కు అందజేశారు. నేనున్నానంటూ భరోసానిచ్చారు.
– బిల్కి సుధాకర్, లింగన్నపేట
సాయం కోరి వచ్చే వారికి అండగా ఉంటా
అనారోగ్యంతో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందిన వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయమందిస్తున్నాం. పైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి ఎల్వోసీ ద్వారా భరోసానిస్తున్నాం. సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారింది. సాయంకోరి వచ్చే వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తున్నాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసానిచ్చేందుకు పార్టీ అధినేత బీమాసౌకర్యం కల్పించారు. కార్యకర్త ఏదైనా ప్రమాదంలో మృతి చెందితే, కుటుంబానికి రూ. 2 లక్షలు బీమా సొమ్మును అందజేస్తున్నాం.
– బాల్క సుమన్, ప్రభుత్వ విప్,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే
సీఎంఆర్ఎఫ్ అండగా నిలిచింది..
మేము 11వ వార్డులో ఉంటాం. నిత్యం కూలీ పనికిపోత. కొద్ది రోజుల క్రితం ఉన్నట్టుండి ఆరోగ్యం దెబ్బతిన్నది. మా బంధువులు దవాఖానకు తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షలు చేసి పక్షవాతం వచ్చిందని హైదరా బాద్‌కు పంపించారు. అక్కడ చికిత్స పొందిన తర్వాత నాకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ 21,000 సాయమందింది. ఈ పథకం నాకు అండగా నిలిచింది.
– చిత్తంపల్లి వజ్ర, మందమర్రి మున్సిపాలిటీ
దేవునోలె ఆదుకున్నరు
నాకు నరాలకు సంబంధించిన వ్యాధి వచ్చింది. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరిన. చికిత్సకు రూ 2,50,000 దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పిన్రు. అంత డబ్బునా దగ్గర లేదు. మా బంధువులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ను కలిసి ఈ విషయం చెప్పిన్రు. ఆయన వెంటనే దయచూపిండు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ 2,50,000 ఎల్వోసీ ఇప్పించారు. నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలే. నేను మంచిగా కోలుకొని ఇంటికి వచ్చిన. నన్ను దేవునోలె ఆదుకున్న సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు రుణ పడి ఉంటా.
– ఆసంపల్లి శ్యాం, దేవులవాడ