చెన్నూర్, జనవరి 13 : రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా చెన్నూర్ నియోజకవర్గంలో ‘సమ్మక్క-సారక్క’ పేరిట మహిళా భవనాలను నిర్మించాలని విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ సంకల్పించారు. మహిళలు స్వశక్తితో ఎదగాలనే ఉద్దేశంతో ఐదు మండలాల్లోని 102 గ్రామ పంచాయతీలు, 3 మున్సిపాలిటీల్లో మహిళా భవనాలు నిర్మించాలని నిర్ణయించి ఆ దిశగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చెన్నూర్ మున్సిపాలిటీలో మహిళా భవన నిర్మాణానికి రూ 1.50 కోట్లు, మందమర్రి మున్సిపాలిటీలో రూ 2 కోట్లు, రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలో రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేయించారు. దీంతో ఆయా చోట్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలాగే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 102 పంచాయతీల్లో భవనాల నిర్మాణానికి తొలి విడుతలో 58 పంచాయతీలను ఎంపిక చేశారు.
చెన్నూర్ మండలం కొమ్మెర, దుగ్నెపల్లి, పొక్కూరు, నాగపూర్, సుద్దాల, అస్నాద్, సోమనపల్లి, కిష్టంపేట, అంగ్రాజుపల్లి, గంగారం, సుందరశాల, కత్తెరశాల, కాచన్‌పల్లి, నారాయణపూర్, ఎర్రగుంటపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. కోటపల్లి మండలం అన్నారం, పారుపల్లి, జనగాం, కొండంపేట, కొల్లూరు, సిర్సా, దేవులవాడ, లింగన్నపేట, మల్లంపేట, నక్కలపల్లి, రాంపూర్, రొయ్యెలపల్లి, శెట్పల్లి, అల్గాం, రాపన్‌పల్లి, నాగంపేట, భీమారం మండలం మద్దికల్, బూరుగుపల్లి, ఆరేపల్లి, కొత్తపల్లి, దాంపూర్, ఖాజీపల్లి, జైపూర్ మండలం మిట్లపల్లి, ఇందారం, రామరావుపేట, షెట్పల్లి, టేకుమట్ల, కుందారం, కిష్టాపూర్, శివ్వారం, పౌనూర్, పెగడపల్లి, ముదిగుంట, కాన్కూర్, మందమర్రి మండలం బొక్కలగుట్ట, అందుగులపేట, చిర్రకుంట, ఆదిల్పేట్, వెంకటాపూర్, మామిడిగట్టు, పొన్నారం, పులిమడుగు, సారంగపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ .18 లక్షలు మంజూరు చేశారు. విడుతల వారీగా నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లోనూ నిర్మించనున్నారు. మహిళా భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడంపై ఊరూరా సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్, విప్ బాల్క సుమన్ చిత్ర పటాలకు పలువురు ప్రజాప్రతినిధులు, మహిళలు పాలాభిషేకాలు చేశారు.
ఇప్పటికే స్థల సేకరణ పూర్తి
నిధులు మంజూరైన గ్రామ పంచాయతీల్లో మహిళా భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అధికారులు సేకరించారు. భూమి పూజ అనంతరం పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే భవన నిర్మాణాల గురించి విప్ బాల్క సుమన్ సంబంధిత అధికారులతో పలుమార్లు సమీక్ష నిర్వహించారు. విశాలమైన హాల్, స్టోర్ రూం, ఆఫీస్ రూం, టాయిలెట్స్‌తో ఆకట్టుకునేలా భవనాలు నిర్మించనున్నారు. గడువులోగా భవనాలన్నీ పూర్తి చేయాలని విప్ ఆదేశించడంతో మరికొద్ది రోజుల్లోనే అవి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
మహిళా భవనాలతో ప్రయోజనాలెన్నో..
‘సమ్మక్క-సారక్క’ పేరిట నిర్మిస్తున్న భవనాలతో అనేక ప్రయోజనాలున్నాయి. స్వయం సహాయక సంఘాల సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు వారి సంఘానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించుకోవడానికి ఈ మహిళా భవనాలు ఉపయోగపడనున్నాయి. పైగా కుట్టు మిషన్, బ్యాగులు, పేపర్ ప్లేట్స్ తయారీవంటి రంగాల్లో మహిళలకు ఈ భవనాల్లో శిక్షణ ఇవ్వవచ్చు. పలు సంఘాలు తీసుకున్న రుణాలను ఈ మహిళా భవనాల నుంచే ఆన్లైన్లో చెల్లించకోవచ్చు. అంతేకాకుండా చిన్న, చిన్న శుభకార్యాలు, చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాక్సినేషన్వంటి అవసరాలకు వాడుకోవచ్చు.
త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం
మహిళలు స్వశక్తితో ఎదగాలనే సంకల్పంతో నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ‘సమ్మక్క-సారక్క’ పేరిట మహిళా భవనాలు నిర్మిస్తున్నాం. ఈ భవనాలు మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతాయి. సమావేశాలు నిర్వహించుకొని చర్చించుకోవడంతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందేందుకు దోహద పడుతాయి. విశాలమైన హాలు, స్టోర్ రూం, ఆఫీస్ రూం, టాయిలెట్స్‌తో అత్యాధునికంగా నిర్మిస్తాం. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి తీసుకువస్తాం.
– బాల్క సుమన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెన్నూర్
మా ఎమ్మెల్యేకు ధన్యవాదాలు
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మహిళలకు ప్రాధాన్యం పెరిగింది. గతంలో మహిళలు ఇంటికే పరిమితమయ్యే వారు. సీఎం కేసీఆర్ మహిళలకు గుర్తింపు తీసుకువచ్చారు. స్వయం సంఘాలతో పాటు పలు సంక్షేమ పథకాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఊరూరా కుట్టు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే సుమన్ సార్ మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొత్తగా భవనాలు నిర్మిస్తున్నారు. ఇందులో సంఘం సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ఇది వరకు చెట్లపొంటి.. తెలిసినోళ్ల ఇండ్లపొంటి మీటింగ్‌లు పెట్టుకున్నం. ఇగ ఆ ఇబ్బందులు ఉండవు. మా ఎమ్మెల్యే సార్‌కు ధన్యవాదాలు.
– తాళ్లపెల్లి దివ్య, కొమ్మెర
మహిళలకు పెద్దపీట
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి పథకంలో మహిళలకు ప్రాధాన్యముంటుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు ఊరికో సమ్మక్క-సారలమ్మ మహిళా భవనాలు నిర్మించేందుకు సర్కారు నిధులు మంజూరు చేసింది. మా ఊరికి కూడా విప్ బాల్క సుమన్ సార్ మహిళా భవనం మంజూరు చేయించారు. ఇందుకు సంతోషంగా ఉంది. ఈ భవనం పూర్తయితే మా మహిళలమంతా ఒకేవేదికపై కూర్చొని అభివృద్ధి గురించి చర్చించుకుంటాం. – గారె సావిత్రి, మల్లంపేట
ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతోనే..
ఎమ్మెల్యే బాల్క సుమన్ సార్ ప్రత్యేక చొరవతోనే సమ్మక్క-సారలమ్మ భవనాలు నిర్మితమవు తున్నాయి. చెన్నూర్ నియోజకవర్గంలోని ఇందారం గ్రామంలో మహిళా సంఘాల కోసం ఇప్పటికే మహిళా భవన్ ఉంది. ఇప్పుడు రూ.18 లక్షలతో మరో భవనం నిర్మిస్తుండడం గొప్ప విషయం. ఇది పూర్తయితే సమావేశాలు నిర్వహించుకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉపాధికి కోర్సులకు సంబంధించిన శిక్షణలు కూడా ఇందులోనే ఇవ్వవచ్చు.
– కాళ్ల సుజాత,భవిత ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు, ఇందారం
మంచి నిర్ణయం
రామకృష్ణాపూర్ (క్యాతనపల్లి) మున్సిపాలిటీలో మహిళా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది. మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఎం.కోమల, టీఎల్ఎఫ్, మెప్మా, అధ్యక్షురాలు, క్యాతనపల్లి
అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట
భీమారం, జనవరి 13 : మా దైవం అయిన సమ్మక్క- సారలక్క పేరిట మహిళా భవనాలు నిర్మిస్తున్నరు. రూ. 18లక్షలు మంజూరు చేశారు. పనులు త్వరగా చేపట్టి అందుబాటులోకి తీసుకు రావాలి. మాకు సమావేశాలు నిర్వహిం చుకునేందుకు ఇది ఉపయోగపడు తుంది. గత ప్రభుత్వాలు మహిళలకు చేసిందేమీ లేదు. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నది.
– ధరావత్ అనిత, సీఏ, బూర్గుపల్లి
రుణపడి ఉంటాం
మందమర్రి మున్సిపాలిటీలో సమ్మక్క-సారలమ్మ పేరిట మహిళా భవనం నిర్మిస్తున్నారు. ఇది మంచి నిర్ణయం. ఇది వరకు సంఘాలకు సంబం ధించిన సమావేశాలు నిర్వహించాలంటే ఖాళీ ఉన్న ప్రదేశాలు, పాఠశాలలను ఆశ్రయించాల్సి వచ్చేది. భవన నిర్మాణం పూర్తయితే ఇగ మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. పట్టణంలోని సంఘాల సభ్యులందరూ విప్ సుమన్‌కు రుణపడి ఉంటారు. – ఏదుల మాలతి, డ్వాక్రా సంఘం సభ్యురాలు
ఇది వరకు ఇలాంటి పథకాలు చేపట్టలేదు
మా మండలంలో 10 గ్రామపంచాయతీలు ఉంటాయి. ఇందులో 9 గ్రామాల్లో సమ్మక్క-సారలక్క పేరిట భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. రెండో విడుతలో ఆయింత ఒక్క ఊరికి కూడా నిధులు మంజూరు చేస్తరట. నిత్యం జరిగే మా మీటింగులకు ఈ భవనాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆడ పిల్ల పుట్టినప్పుటి నుంచి పెండ్లయ్యేదాకా ప్రభుత్వం ఏదో ఒక రూపంలో సాయమందిస్తుంది. ఇది వరకున్న ప్రభుత్వాలేవీ మహిళల కోసం ఇలాంటి పథకాలు చేపట్టింది లేదు. కేసీఆర్‌గా ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మహిళలకు మేలు చేస్తారన్న నమ్మకముంది. – బోలేం సరిత, సారంగపల్లి