గుండాలలో సహజ విస్తరాకుల తయారీ కేంద్రం
పోలీసులు, చిరాగ్ ఫౌండేషన్ సహకారంతో కుటీర పరిశ్రమ
30 మంది గిరిజన మహిళలకు స్వయం ఉపాధి
కుమ్రం భీం ఆసిఫాబాద్/తిర్యాణి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : అడవిబిడ్డలు పోలీసుల సహకారంతో కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. అమెరికాకు చెందిన చిరాగ్ ఫౌండేషన్ అందించిన మిషన్ ద్వారా మోదుగ, అడ్డాకుల విస్తరాకులను తయారీ చేసి విక్రయిస్తున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం గుండాలకు చెందిన 30 మంది గిరిజన మహిళలు కలిసికట్టుగా ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తిర్యాణి మండలం గుండాల గిరిజన మహిళలు ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. అమెరికాకు చెందిన చిరాగ్ ఫౌండేషన్ సహకారంతో పోలీసులు విస్తరాకుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, వారంతా స్వయం ఉపాధి పొందుతున్నారు. అడవుల్లో సహజంగా దొరికే మోదుగ, అడ్డాకులతో ఆకర్షణీయమైన విస్తరాకులను తయారు చేసి విక్రయిస్తున్నారు. తిర్యాణి అడవుల్లో మోదుగ, అడ్డాకులకు కొదువలేదు. గుండాలకు చెందిన మహిళలు అడవికివెళ్లి ఆకులను తీసుకొచ్చి, వెదురు పుల్లలతో విస్తర్లు కుట్టి ఆరబెట్టిన తర్వాత వాటిని విక్రయించేవారు. 100 విస్తర్లను తయారు చేసేందుకు రెండు రోజులు పట్టేది. కట్టకు రూ. 150 నుంచి రూ. 200 వరకు దుకాణాల్లో విక్రయించేవారు. కూలి గిట్టుబాటు అయ్యేది కాదు.
పోలీసుల సహకారంతో..
పోలీసులు మీ కోసంలో భాగంగా అమెరికాకు చెందిన చిరాగ్ ఫౌండేషన్ సహకారంతో పోలీసులు రూ. లక్షా 50 వేల విలువచేసే మిషన్‌ను అందించారు. 30 మంది మహిళలతో కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసి ఇటీవలే ప్రారంభించారు. మిషన్‌పై విస్తర్లు తయారు చేయడంపై ఇద్దరు యువకులు శిక్షణ కూడా ఇచ్చారు. ఆకులను చేతులతో కుట్టి మిషన్‌లో పెట్టడం వల్ల స్మూత్‌గా ఆకర్శణీయంగా తయారవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్, డిస్పోజల్ ప్లేట్ల మాదిరిగానే ఉంటాయి. గతంలో రెండు మూడు రోజులు ఆకులను ఆరబెట్టాల్సి వచ్చేది. ప్రస్తుతం కేవలం విస్తర్లు తయారు చేసి మిషన్‌లో పెడితే చాలు.. ఆ వెంటనే అమ్ముకోవచ్చు. ఈ మిషన్ ద్వారా రోజుకు 1000 నుంచి 1500 విస్తరాకులను తయారు చేస్తున్నారు. ఒక్కో విస్తరాకుకు మార్కెట్లో రూ. 5 నుంచి రూ. 6 వరకు ధర ఉంది. 100 విస్తర్ల కట్టని మార్కెట్లో హోల్‌సేల్‌గా రూ. 400 విక్రయించినా.. 1000 విస్తారాకులకు రూ. 4000 దాకా పొందవచ్చు.
మోదుగ విస్తర్లకు గిరాకీ..
అడవిలో దొరికే సహజమైన మోదుగ ఆకుల విస్త్తరాకులకు పట్టణాల్లో మంచి గిరాకీ ఉంది. పూర్వకాలం నుంచి వివాహాది శుభకార్యాలకు మోదుగ విస్తరాకులనే వాడేవారు. మారుతున్న కాలానికి అ నుగుణంగా ప్లాస్టిక్, డిస్పోజల్ ఇలా రకరకాల విస్తరాకులు మార్కెట్లోకి వచ్చాయి. ఇలాంటివి వినియోగించడంవల్ల ఆరోగ్యం పాడవడంతో పాటు వా తావరణానికీ ముప్పు పొంచి ఉంది. ఇలాంటి క్ర మంలో అడవిలో దొరికే సహజ సిద్ధమైన మోదుగ, అడ్డాకుల విస్త్తరాకులకు డిమాండ్ ఏర్పడింది.
బతుకుదెరువు చూపిన్రు..
మా ఊరిలో ఎవుసం తప్ప వేరే పని దొరకదు. ఎక్కడికైనా పోయి చేసుకుందామనుకున్నా కొండ.. కోనలు దాటాల్సి ఉంటది. ఇగ మా ఊరిలోనే విస్తరాకులు తయారీ చేసి పట్టణాల్లో అమ్ముకోవాలనుకున్నం. అందరం అడవికి వెళ్లి మోదుగ ఆకులు తెచ్చుకొని విస్తర్లు కుడుతం. రెండు రోజులు కష్టపడితే 100 విస్తరాకులు తయారు చేసేటోళ్లం. ఆ తర్వాత మండలాలకు పోయి అమ్ముకునేటోళ్లం. మా ఊరికి ఎస్ఐ రామారావు సార్ వచ్చినప్పుడు మా ఇబ్బందులు చెప్పినం. ఆయన మాకు బతుకుదెరువు చూపించిండు. మిషన్ తెచ్చి పెట్టిన్రు. ఈ మధ్యనే ప్రారంభించిన్రు. రోజుకు 1500 విస్తరాకులు తయారు చేస్తున్నం. బయట అమ్ముకోవడానికి కూడా ఆయన అవకాశం కల్పించారు.
చేతినిండా పని కల్పించినం..
గుండాలలో30 మంది మహిళలు విస్తరాకుల తయారీని ఎంచుకున్నారు. అందరూ అడవుల్లోకి వెళ్లి ఆకులు తెచ్చి కుట్టి అమ్ముకునేవారు. దీంతో వాళ్లకు కూలి గిట్టుబాటు అయ్యేది కాదు. పోలీసులు మీ కోసంలో భాగంగా గుండాల గ్రామాన్ని సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకున్నా. మహిళలకు చేతినిండా పని దొరకాలన్న ఉద్దేశంతో విస్తారాకుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. అమెరికాకు చెందిన చిరాగ్ ఫౌండేషన్ సహకారంతో మిషన్లు తెప్పించాం. ఇటీవల ప్రారంభించాం. గ్రామానికి చెందిన ఇద్దరికి హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించాం. ఇప్పుడు 30 కుటుంబాలు ఒక సంఘంగా ఏర్పడి విస్తర్ల తయారీతో ఉపాధి పొందుతున్నారు. మార్కెంటింగ్ చేసుకునేలా సహకరించాం.