ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు
స్వరాష్ట్రంలో మూడుసార్లు వేతనాల పెంపు
ఆనందంలో టీచర్లు, ఆయాలు
రుణపడి ఉంటామంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
అంగన్వాడీలకు 30 శాతం వేతనం పెంపు
మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : అంగన్వాడీలకు రాష్ట్ర సర్కారు మరోసారి వేతనాలు పెంచి సముచిత స్థానం కల్పించింది. అంగన్వాడీ టీచర్లకు రూ.10,500 నుంచి రూ.13,650కి, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రూ.6వేల నుంచి రూ.7,800కు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం జీతం పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7,271 మందికి ప్రయోజనం చేకూరనుండగా, ప్రతినెలా సర్కారు రూ.7.61 కోట్లు చెల్లించనున్నది. గత ప్రభుత్వాలు వెట్టిచాకిరీ చేయించుకొని తమ బాగోగులను పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మూడుసార్లు సాలరీ పెంచారని, ఆయనకు రుణపడి ఉంటామని చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలో సేవలందించే అంగన్వాడీలకు సీఎం కేసీఆర్ మరోసారి జీతాలు పెంచి సముచిత స్థానం కల్పించారు. సగౌరవంగా జీవించేలా చేశారు. గత ప్రభుత్వాలు వారితో వెట్టిచాకిరీ చేయించుకొని వారి బాగోగులు పట్టించుకోలేదు. రాష్ట్ర సర్కారు మాత్రం అంగన్వాడీ టీచర్ల జీతాన్ని రూ.10,500 నుంచి రూ. 13,650కు పెంచి వారి సేవలకు గుర్తింపు ఇచ్చింది. కార్యకర్తల సహాయకులకు కూడా పెంచింది. మినీ అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.6,000 నుంచి 7,800కు పెంచడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం వేతనాలు పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని జీవోలో పేర్కొన్నది. దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరిగేలా ప్రచారం చేయడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములవడం, చిన్న పిల్లల సంరక్షణ, ఆటపాటలతో కూడిన విద్యనందించేందుకు ముందున్న వారికి పీఆర్సీలోనూ అవకాశం కల్పించింది. ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న అంగన్వాడీలకు రెండోసారీ వేతనాలు పెంచి వారిపై ప్రేమను చాటుకున్నది. దీంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సంబురాలు చేసుకుంటున్నారు.
స్వరాష్ట్రంలో సముచిత స్థానం..
అంగన్వాడీలను గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. వారితో వెట్టిచాకిరీ చేయించుకొని మొక్కుబడి జీతాలు ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సర్కారు అంగన్వాడీలకు ఏడేండ్లలో మూడుసార్లు వేతనాలు పెంచింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 9 నెలలకు అంగన్వాడీ టీచర్లకు రూ.4,200 నుంచి రూ. 7,000, మినీ అంగన్వాడీలు, ఆయాలకు రూ.2,200 నుంచి రూ.4,500కు పెంచింది. 2017 ఫిబ్రవరి 27న సీఎం కేసీఆర్ అంగన్వాడీ టీచర్లు, ఆయాలను హైదరాబాద్‌కు పిలిపించుకొని వారితో కలిసి భోజనం చేశారు. సమస్యలను క్షుణ్నంగా తెలుసుకొని రెండోసారి వేతనాలు పెంచారు. ప్రభుత్వం సర్కారు ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ప్రకటించింది. ముచ్చటగా మూడోసారి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసి వారిపై అభిమానాన్ని చాటుకుంది. అంగన్వాడీ టీచర్లకు రూ.10,500 నుంచి రూ.13,650కు, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.6,000 నుంచి రూ. 7,800కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంపై సంబురాలు చేసుకుంటున్నది.
కేసీఆర్‌తోనే జీతాలు పెరిగాయ్
కోటపల్లి, ఆగస్టు 19 : సీఎం కేసీఆర్ జీతాలు పెంచి మా బతుకులను మార్చారు. రూ.2,200 ఉన్న మా జీతాన్ని రూ. 7,800కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. సమైక్య పాలనలో సరైన గుర్తింపు లేక ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడుసార్లు వేతనాలు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంతో ఫిట్మెంట్ అందివ్వడం ఆనందంగా ఉంది.
బాధ్యతాయుతంగా పనిచేయాలి
అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీలు, ఆయాలు/హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం ఇచ్చి గౌరవం ఇచ్చింది. వేతనాలు పెంచడం, ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు పీఆర్సీ ఇవ్వడం, సంతోషంగా ఉంది. అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలి. తల్లీబిడ్డల సంక్షేమం కోసం పాటుపడాలి.
బాధ్యత పెరిగింది..
వేమనపల్లి, ఆగస్టు 19 : గతంలో అంగన్వాడీ టీచర్లను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలే. వెట్టిచాకిరీ చేయించుకున్నారే తప్పా మా బతుకుల గురించి ఆలోచించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇ ప్పటి వరకు కేసీఆర్ సర్కారు ముచ్చటగా మూడుసార్లు వేతనాలు పెంచింది. జీతాల పెంపుతో బాధ్యత మరింత పెరిగింది. ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.