సింగరేణితో వాణిజ్య ఒప్పందం చేసుకుంటే అనేక ప్రయోజనాలు
‘ఆత్మనిర్భర్ భారత్’లో మన బొగ్గుకు మార్కెట్ పెంపు
సీఎండీ ఆదేశాల మేరకు అదనంగా 2 మిలియన్ టన్నుల బొగ్గుకు ఈ వేలం
జీఎం (మార్కెటింగ్) కే రవిశంకర్, అధికారులు
కర్ణాటక స్పాంజ్ ఐరన్ సంస్థలతో వీడియో కాన్ఫరెన్స్
శ్రీరాంపూర్, ఆగస్టు 16: విదేశీ బొగ్గు కన్నా దేశీయంగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తున్న సింగరేణితో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని జీఎం(మార్కెటింగ్) కే రవిశంకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో కర్ణాటకలోని బళ్లారి, హోస్పేటకు చెందిన 40 స్పాంజ్ ఐరన్ సంస్థల ప్రతినిధులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా దేశీయ బొగ్గుకు మార్కెటింగ్ అవకాశాలను పెంచి, తద్వారా విదేశీ దిగుమతులను తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు సింగరేణి ద్వారా అదనంగా 2 మిలియన్ టన్నుల బొగ్గును నాన్ రెగ్యులేటెడ్ సంస్థలకు ఈ – వేలం లింకేజీ ద్వారా నోటీఫైడ్ ధరకే విక్రయించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశ పెట్టిన యాక్షన్ ఆఫ్ లింకేజీ (ఏఓఎల్) విధానం ద్వారా పూర్తి పారదర్శకంగా బొగ్గు విక్రయాలను చేసేందుకు అవకాశం లభించిందని, ఈ పద్ధతి ద్వారా ఇప్పటికే ఆరుసార్లు సింగరేణి వేలం నిర్వహించి సిమెంట్, క్యాప్టీవ్ పవర్, స్పాంజ్ ఐరన్, పేపర్, ఫార్మా డ్రగ్స్ తదితర సంస్థలకు 10-9 మిలియన్ టన్నుల బొగ్గును లింకేజీ చేసిన విషయాన్ని వివరించారు. ఏడోసారి అదనంగా 2 మిలియన్ టన్నులకు నిర్వహిస్తున్న ఈ-వేలం నిర్వహణ విధానం సింగరేణి బొగ్గు నాణ్యత తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు స్పాంజ్ ఐరన్ సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు జీఎం(కోఆర్డినేషన్) కే సూర్యనారాయణ తెలిపారు. సింగరేణిలో జీ-5 గ్రేడ్ బొగ్గు కూడా అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. కర్ణాటకలో పలు సంస్థలు సింగరేణి బొగ్గు గురించి పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల విదేశీ బొగ్గుపై ఎక్కువగా ఆధార పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పాంజ్ ఐరన్ ప్రతినిధుల పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఒకవేళ సంస్థలతో ఒప్పందం జరిగితే రానున్న ఐదేళ్ల వరకు ఉన్న మార్కెటింగ్ అవకాశాలతో పాటు అదతనంగా 2 మిలియన్ టన్నులకు అవకాశం ఏర్పడనుందని పేర్కొన్నారు. సమావేశంలో ఈడీ (కోల్ మూమెంట్) అల్విన్, డీజీఎంలు ఎన్వీ రాజశేఖర్‌రావు, టీ శ్రీనివాస్, ఎం వెంకటేశ్వర్లు, ఎస్ సం జయ్ పాల్గొన్నారు.