మందమర్రి సీఐ ప్రమోద్‌రావు, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు
మందమర్రి ఆగస్టు 16 : మున్సిపాలిటీలో అనధికార, అక్రమ కట్టడాలు, అనుమతి లేని లేఅవుట్లను గుర్తించి చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ స్కాడ్( టాస్క్‌ఫోర్స్ బృందాలను) ఏర్పాటు చేసిందని మందమర్రి సీఐ ప్రమోద్‌రావు, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ చట్టం-2019, టీఎస్ బీపాస్ చట్టం-2020 ప్రకారం అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే టాస్క్‌ఫోర్స్ బృందాలు నిర్మాణాలను, అక్రమ లేఅవుట్లను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మందమర్రి సీఐ ప్రమోద్‌రావు, ఎస్ఐ భూమేశ్, డీటీ బైరెడ్డి స్వప్న, అగ్నిమాపక శాఖ ఎస్ఎఫ్వో డీ అనిల్, ఏఈ హరీశ్, టీపీఎస్ కల్యాణచక్రవర్తితో టా స్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా మున్సిపల్ అనుమతి లేకుండా, అనుమతి పొందిన దానిని
అతిక్రమించి చేపట్టిన కట్టడాలను గుర్తించి నూతన మున్సిపల్ చట్టం ప్రకారం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేస్తామని, లేకుంటే భూమి విలువపై 25 శాతం జరిమానా విధించనున్నట్లు వారు తెలిపారు. జరిమానా చెల్లించకుంటే మూడేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వారు పేర్కొన్నారు.