‘నమస్తే’ ఇంటర్వ్యూలో రామగుండం సీపీ చంద్రశేఖర్రెడ్డి
నిర్భయంగా పోలీసులను సంప్రదించొచ్చు..
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్టు
దొంగతనాలు, సైబర్ నేరాల నియంత్రణకు కృషి
మహిళల రక్షణకు ప్రాధాన్యం
భూ బాధితులకు న్యాయం చేస్తాం
మంచిర్యాల, నమస్తే తెలంగాణ/ గర్మిళ్ల, ఆగస్టు 13 : ప్రజా శ్రేయస్సే ప్రధాన ధ్యేయమని, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని రామగుండం పోలీసు కమిషనర్ ఎస్.చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని, దొంగతనాలు, మహిళల వేధింపులు, అసాంఘిక కార్యకలాపాలు, రోడ్డు ప్రమాదాలు, భూ తగాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెడుతామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని, అవసరమైతే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువత వ్యసనాలను వదిలి సన్మార్గంలో నడిచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ప్రజా శ్రేయస్సే తమ ధ్యేయమని రామగుండం పోలీసు కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, పలు అంశాలపై మాట్లాడారు.
నమస్తే తెలంగాణ : బాధితులు నిర్భయంగా ఠాణాలోకి వచ్చి సమస్యను విన్నవించేలా, ఫిర్యాదు చేసేలా ఎలాంటి భరోసా కల్పిస్తారు?
సీపీ చంద్రశేఖర్ రెడ్డి : ప్రజాశ్రేయస్సే మా ప్రధాన ధ్యేయం. శాంతి భద్రతల విషయంలో ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చు. బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పిస్తాం. శాంతిభద్రతలు, విధులకు విఘాతం కలిగిస్తే, అవసరమైతే పీడీ యాక్టు కూడా అమలు చేస్తాం.
నమస్తే : మహిళలపై వేధింపులు, దొంగతనాల నివారణకు ఎలాంటి చర్యలు ఉంటాయి?
సీపీ : జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. సీసీ కెమెరాల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తాం. ఇంట్లో, దుకాణాల్లోనూ సీసీ కెమెరాలు వాడడంతో దొంగలు, నేరస్తులను సులువుగా పట్టుకోవచ్చు. నేరాల సంఖ్య కూడా తగ్గుతుంది. వ్యాపారులు నిఘా నేత్రాలు వాడేలా ప్రోత్సహిస్తాం. సీసీ కెమెరాల వాడకంతో కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. నేరాలు, దొంగతనాలపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంటుంది. మన రాష్ట్రంలో పోలీస్ శాఖ మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. షీ టీంలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. మహిళల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తాం. బ్లూ కోల్ట్స్ సిబ్బంది కొరతను అధిగమించి, ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా కృషి చేస్తాం.
నమస్తే :జిల్లాలో ప్రభుత్వ నిషేధిత పొగాకు (గుట్కా) అమ్మకం జోరుగా సాగుతున్నది. నాలుగైదు రోజులకు ఒకచోట పట్టుబడుతూనే ఉన్నది. ఎలా అరికడతారు?
సీపీ : గుట్కాలు ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్నట్లు తెలిసింది. కమిషనరేట్ పరిధిలో గుట్కా అమ్మకాలపై చర్యలు తీసుకుంటాం. గంజాయి, పేకాట,మట్కాపై కూడా దృష్టిసారిస్తాం.
నమస్తే : యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఏం చేస్తారు?
సీపీ : యువత అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా పెడుతాం. దేనిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారో తెలుసుకుంటాం. వారికి అవగాహన కల్పించి సన్మార్గంలో నడిచేలా చూస్తాం. ప్రజలకు అవగాహన లేక సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. నివారణకు కృషి చేస్తాం.
నమస్తే : రోడ్డు ప్రమాదాల నివారణకు ఏయే చర్యలు చేపడతారు?
సీపీ : రోడ్డు ప్రమాదాలతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటిస్తే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు. రూల్స్ పాటించేలా కౌన్సెలింగ్ ఇస్తాం. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టి నివారణకు కృషిచేస్తా. ఏ పట్టణాలు,ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో గుర్తిస్తాం. కారణాలపై విశ్లేషిస్తాం.
నమస్తే : జిల్లాలో భూ దందాలు, వివాదాలు, వీటి వ్యాపారాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. వీటిని ఎలా తగ్గిస్తారు?
సీపీ : భూమికి సంబంధించి ఫిర్యాదులు వచ్చినప్పుడు సివిల్, రెవెన్యూ, క్రిమినల్.. దేనికి సంబంధించిందో పరిశీలిస్తాం. భూ వివాదాలను చట్టాల ఆధారంగా, న్యాయపరంగా పరిష్కరించాల్సి ఉంటుంది. బాధితులకు న్యాయం చేసేలా కృషి చేస్తాం.