మంచిర్యాల టౌన్, ఆగస్టు 16 : మంచిర్యాల పట్టణంలో 42.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. టూ టౌన్ ఏరియాలోని సూర్యనగర్ నీట మునిగింది. ఇండ్లలోకి, అలాగే హమాలీవాడ, తిలక్‌నగర్, బృందావన్ కాలనీ, సీతారామకాలనీ, సున్నంబట్టివాడ, సాయికుంట, గర్మిళ్ల, పాత మంచిర్యాల తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వరద చేరింది. రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎగువన ఉన్న మందమర్రి, నెన్నెల, కాసిపేట, తిర్యాణి మండలాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. బైపాస్‌రోడ్డు నుంచి రంగంపేటకు మధ్య కాజ్వే పైనుంచి ప్రవహించింది. బైపాస్‌రోడ్డు నుంచి రంగంపేట, పవర్కాలనీ, పాత మంచిర్యాల, అండాళమ్మకాలనీల వైపునకు రాకపోకలు నిలిచిపోయాయి.
హాజీపూర్, ఆగస్టు 16 : ముల్కల్ల శివారులో జాతీయ రహదారిపై ఓ భారీ చెట్టు నేలకొరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హాజీపూర్ మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, ఎస్ఐ స్వరూప్ రాజ్ అక్కడికి చేరుకుని, ఎక్స్‌కవేటర్‌తో చెట్టును తొలగించారు.
బెల్లంపల్లి, ఆగస్టు 16 : బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్ బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహించింది. మరోసారి హన్మాన్బస్తీ, రాంనగర్వాసుల రాకపోకలు స్తంభించి పోయాయి. బ్రిడ్జి నిర్మాణంపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ హామీ ఇచ్చినా కష్టాలు తప్పడంలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12వ వార్డులో ఇళ్లలోనికి వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలయమమవగా, ప్రధాన రహదారుల్లో భారీగా నీరు చేరింది. ఏఎంసీ ఏరియాలో గల మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సింగరేణి క్వార్టర్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. స్టోర్ రూమ్, డైనింగ్ హాల్ గదుల్లోని కప్పు కొంత భాగం పెచ్చులు నేలమట్టమయ్యాయి.
ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రమాద తప్పినట్లయింది. ఏఎంసీ ఏరియాలో సింగరేణి బీ క్లాస్ క్వార్టర్లో నివాసంతో పాటు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. క్వార్టర్ శిధిలావస్థకు చేరిందని, మరమ్మతులు చేయించాలని మందమర్రి జీఎంకు దుర్గం చిన్నయ్య ఈ ఏడా ది మార్చిలో దరఖాస్తు ఇచ్చారు. కొత్తగూడెం కార్పొరేట్ ఆధ్వర్యంలోనే మరమ్మతులు చేయించుకోవాలని జీఎం కార్యాలయ అధికారులు చేతులు దులుపుకున్నారు. దాని పక్కనే ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే గడ్డం వినోద్ సింగరేణి క్వార్టర్‌కు మాత్రం మరమ్మతులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నూర్, ఆగస్టు 16 : చెన్నూర్ పట్టణంలోని రోడ్లన్నీ జలమయయ్యాయి. మున్సిపాలిటీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్, ప్రత్యేక రెస్క్యూటీం ఏర్పాటు చేశారు. పలు ఇండ్లలోకి నీరు చేరడంతో మున్సిపల్ సిబ్బంది మోటర్లు ఏర్పాటు చేసి, ఎత్తిపోశారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉంటున్న వారిని మైనార్టీ ఫంక్షన్హాల్లో పునరావాస కేంద్రానికి తరలించారు.
చెన్నూర్ రూరల్, ఆగస్టు 16 : అక్కెపల్లి కాజ్వే, కత్తరశాల వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్లతో పాటు, మట్టి గోడల్లో ఉంటున్న వారి ఇండ్లను ఖాళీ చేయించారు. అస్నాద్లో ఇండ్లలోకి నీరుచేరగా, ఎంపీడీవో మోహన్ పరిశీలించారు. అన్నారం బ్యారేజ్‌కు వరద ప్రవాహం పెరుగుతున్నందున పరీవాహక గ్రామాల ప్రజలను సీఐ దేవేందర్ అప్రమత్తం చేశారు.
లక్షెట్టిపేట, ఆగస్టు 16 : లక్షెట్టిపేట పట్టణంలోని మస్తాన్ గూడ, బీట్ బజార్, గోదావరి రోడ్, పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాసర్, సీఐ రమణమూర్తి, తహసీల్దార్ దిలీప్‌కుమార్, ఎస్ఐ సతీశ్ పరిశీలించారు. కొమ్ముగూడెం గ్రామ చెరువు నిండగా, మత్తడి వద్ద జేసీబీతో అధికారులు కాలువ తవ్వడంతో ప్రమాదం తప్పింది. పోతపల్లి మధ్యలో వాగునీరు రోడ్డుపై పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
భీమారం, ఆగస్టు 16 : నిజామాబాద్-జగ్దల్పూర్ రహదారి భీమారం ఆరెపల్లి చౌరస్తాతో పాటు, బూర్గుపల్లి-నర్సీంగాపూర్ మధ్యలో ఉన్న పెద్ద వాగు లోలెవల్ వంతెనపై నీరు చేరింది. వాహన రాకపోకలకురాయం ఏర్పడింది. చెన్నూర్ వైపునకు బైకుపై వెళ్తున ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడడంతో స్వల్పంగా గాయపడ్డాడు. మన్నెపువాడ సమీపంలో నాళాలు సరిగ్గా లేక నీరు రోడ్డుపై చేరింది.
జన్నారం, ఆగస్టు 16 : జన్నారం మండలంలోని పొనకల్ వాగు ఉప్పొంగింది. వాగు ఒడ్డున గల బుడగజంగాల కాలనీవాసులను ముందు జాగ్రత్తగా ఎస్ఐ అనూష, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఎంఈవో విజయ్‌కుమార్ స్థానిక గిరిజన అశ్రమ పాఠశాలకు తరలించి, పునరావాసం కల్పించారు. సాయిబాబా కాలనీ, శ్రీలంక కాలనీల్లో రోడ్లపైన నీటి ప్రవాహంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడారు. రోటిగూడ గ్రామంలో ప్రధాన రోడ్డు కల్వర్టు ఉప్పొంగడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు.
దండేపల్లి, ఆగస్టు 16 : దండేపల్లి మండలంలోని గూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. భక్తులు పుణ్యస్నానాల కోసం లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మేదరిపేట-నర్సాపూర్ మధ్య లోలెవల్ వంతెన నీటమునిగింది. రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్ఐ తహసినుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు ఎక్స్కవేటర్ సాయంతో నీటిని తొలగించారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన శాతరాజు సతీశ్‌కు చెందిన ఇంటి గోడ కూలిపోయింది. ఇందిరమ్మ ఇంటి కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని, బాధితుడు వాపోయాడు. గ్రామంలో ఇండ్లు ఉన్నవాళ్లకే ఇచ్చారని, తమలాంటి పేదవాళ్లను పట్టించుకోలేదని ఆందోళన చెందాడు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి, తనకు ఇల్లు ఇళ్లు మంజూరు చేయాలని వేడుకున్నాడు.
శ్రీరాంపూర్, ఆగస్టు 16 : శ్రీరాంపూర్ ఓసీపీలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోజుకు 10 వే ల టన్నులు, ఇందారం ఓసీపీలో 5 వేల టన్నుల చొ ప్పున బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. వాహనాలు క్వారీలోకి వెళ్లేందుకు వీలులేకుండా బురదమయంగా మారాయి. ఓసీపీలు వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్నాయి. మట్టి తవ్వకాలు, రవాణాకూ అంతరాయం ఏర్పడింది.
నెన్నెల, ఆగస్టు 16 : నెన్నెల మండలంలోని కుమ్మరివాగు చెరువు కుడి కాలువ తెగడంతో వరద పంట పొలాల్లోకి చేరింది. పలు ప్రభుత్వ కార్యాలయాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. కొన్ని గంటల పాటు కార్యాలయాలకు వెళ్లేందుకు దారి కూడా కనిపించలేదు. ఏడీఏ కార్యాలయంలోకి, పక్కనే ఉన్న పీహెచ్సీ భవనం మెట్ల వరకు, ఎస్సీ బాలుర వసతి గృహం మైదానంలోకి నీరు చేరింది. ఎర్రవాగు ఉధృతంగా ప్రవహించడంతో, దాదాపు వంద ఎకరాల వరకు పత్తి పంట నీటి పాలైంది. జోగాపూర్ మత్తడి వాగు ఉధృతంగా ప్రవహించడంతో వంతెనపై నుంచి వరద ప్రవహించింది. గొల్లపల్లి, మైలారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెన్నెల-ఆవుడం వెళ్లే ప్రధాన రోడ్డుపై నుంచి మత్తడి అధికంగా ఉండడంతో ఎస్ఐ ప్రసాద్ రాకపోకలు సాగకుండా చూశారు. గంగారం, నెన్నెల, ఆవుడం గ్రామాల్లో 5 ఇండ్లు కూలిపోయాయి. ఎంపీడీవో మమ్మద్ అబ్దుల్ హై డీటీ ప్రకాశ్, ఎంపీవో శ్రీనివాస్, ఎస్ఐ ప్రసాద్ పరిస్థితితులను పరిశీలించారు. ఎర్రవాగు ప్రవాహం, దెబ్బతిన్న పంటలు, కుమ్మరి వాగు చెరువు కుడికాలువ, నీరు చేరిన ఇండ్లను బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్ పరిశీలించారు.
వేమనపల్లి, ఆగస్టు 16 : నీల్వాయి-మామడ దారి లో వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఎంపీడీవో కుమారస్వామి, ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. వాగు వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. బద్దెంపల్లిలోని తొర్రెం చిన్న రాజక్క ఇల్లు, కేతనపల్లిలోని అనుముల బాపు ఇంటి గోడ పూర్తిగా కూలిపోయింది. కల్లెంపల్లిలో గర్భిణి కుడిమేత భారతిని వైద్యుడు రాజేశ్ ఆధ్వర్యంలో ముందస్తుగా 108 అంబులెన్స్ ద్వారా పీహెచ్‌సీకి తరలించారు. నీల్వాయి కేజీబీవీలో వర్షపు నీరు నిలువడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఎంపీడీవో కుమారస్వామి పరిశీలించి, నీటిని తొలగించాలని కార్యదర్శికి సూచించారు. బుయ్యారం గ్రామ సమీపంలో కల్వర్టుపై నుంచి వరద ప్రవహించడంతో కల్వర్టు కొట్టుకుపోయింది. వేమనపల్లి-బెల్లంపల్లికి రా కపోకలు నిలిచిపోయాయి. నీల్వాయి ప్రాజెక్టు మత్తడి దుంకుతున్నది. మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఎం పీడీవో కుమారస్వామి, తహసీల్దార్ సంధ్యారాణి గ్రా మాల్లో పర్యటించారు. ప్రాణహిత ఉధృతంగా ప్రవహించడంతో పడవలు నడపవద్దని, సమీప సుం పుటం, వేమనపల్లి, జాజులపేట, ముక్కిడిగూడెం, కల్లె ంపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు.
కోటపల్లి, ఆగస్టు 16 : కోటపల్లి మండలం మల్లంపేట-నక్కలపల్లి మార్గమధ్యలోని లోతొర్రె ఉప్పొంగింది. ఒర్రెపైన ఉన్న రోడ్డు కోతకు గురికావడంతో రాకపోకలు నిలిపివేశారు. ఎస్ఐ రాజేందర్ ఈ మార్గంలో పర్యటించి, ప్రయాణికులకు సూచనలు చేశారు. ఎదుల్లబంధం తుంతుంగా చెరువు వరద కారణంగా గ్రామానికి వెళ్లేదారిలో రహదారి కోతకు గురైంది. తహసీల్దార్ రాఘవేద్రరావ్, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, ఎస్ఐ రాజేందర్ సందర్శించి, రాకపోకలను నిలిపివేశారు. జనగామలో చెన్నూరి కవితకు చెందిన ఇల్లు కూలిపోగా, కోటపల్లికి చెందిన సంగర్తి సమ్మక్క ఇంట్లోకి నీరు చేరింది. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
తాండూర్,ఆగస్టు16: తాండూర్ మండలంలోని రేచిని, గజ్జలపల్లి, బారేపల్లి గ్రామాల మధ్య కల్వర్టులను ఎస్ఐ కిరణ్‌కుమార్, సిబ్బంది పరిశీలించారు. అచ్చలాపూర్‌లో ఓ ఇంట్లోకి చేరింది. భారుపల్లిలో హన్మాన్ ఆలయ ప్రరీ పాక్షికంగా దెబ్బతిన్నది.
కన్నెపల్లి, ఆగస్టు 16 : కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి, లింగాలలో పంటలు నీట మునిగాయి. కన్నెపల్లిలోని నల్లవాగు ఉధృతంగా ప్రవహించడంతో పంటలకు నష్టం వాటిల్లింది.
కాసిపేట, ఆగస్టు 16 : కాసిపేట మండలంలోని బుగ్గగూడెంకు చెందిన మార్నేని సంజీవ్, మార్నేని సంతోష్, మార్నేని సాగర్, బద్ది అరుణ్, ఏదుల శశికుమార్ వరిపేట శివారు, కన్నాల పరిధిలోని బుగ్గ చెరువు మత్తడిలో చేపల వేటకు వెళ్లగా, అక్కడే చిక్కుకున్నారు. వారిని తాళ్లసాయంతో స్థానికులు కాపాడారు. గంట సేపు ప్రయత్నించి వారిని భయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మందమర్రి, ఆగస్టు 16 : మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ, గాంధీనగర్, విద్యానగర్, దొరలబంగ్లా ఏరియా, ఒకటి, రెండు, మూడోజోన్ కార్మిక కాలనీల్లో పలు ఇండ్లు, సింగరేణి క్వార్టర్లలోకి వర్షపు నీరు చేరింది. రైల్వే లైన్లు, కోల్‌బెల్ట్ రహదారిపై నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. శాంతినగర్‌లో రెండు ఇండ్లు, విద్యానగర్‌లో ఒక ఇల్లు, సీఎస్పీ రోడ్డు కాలనీలో ఒక ఇంటి ప్రహరీ గోడలు కూలాయి. కమిషనర్ తుంగపిండి రాజలింగు సిబ్బందితో కలసి ఆయా ప్రాంతాలను సందర్శించారు. కార్మెల్ కళాశాల పక్కన వర్షపు నీరు క్వార్టర్లలోకి చేరడంతో జేసీబీ సాయంతో మట్టిని తొలగించి, కాలువల్లోకి మళ్లించారు. శంకర్పల్లి వద్ద పాలవాగు ఉధృతంగా ప్రవహించడంతో సింగరేణి అధికారులు అప్రమత్తమయ్యారు. కేకే-5 గని భూగర్భంలో విధులు నిర్వహించే కార్మికులకు పలు సూచనలు చేశారు. గని మేనేజర్ శంభూనాథ్ పాండే, ఏజెంట్ రాంబాబు ఉద్యోగులకు సూచనలు చేశారు. సుమారు గంటపాటు పనులు నిలిచిపోయాయి. ఏరియా జీఎం దేవేందర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
భీమిని, ఆగస్టు 16 : పెద్దపేట, చె న్నాపూర్, వెంకటాపూర్, వడాల, చిన్నగుడిపేట, కర్జీభీంపూర్, అక్కలపల్లి, భీమిని, రాంపూర్ గ్రామాల్లో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అధికారులు సర్వే చేసి, పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
ఆసిఫాబాద్ టౌన్/అంబేదర్ చౌక్, ఆగస్టు 16 : మండలంలోని రాజుర సమీపంలోని ఒర్రె ఉధృతంగా ప్రవహించగా, రోడ్డు పూర్తిగా తెగిపోయింది. రాకపొకలు నిలిచిపోయాయి. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, తహసీల్దార్ రియాజ్ అలీ, డీపీవో భిక్షపతి గౌడ్, డీఎల్పీవో ఉమర్ సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. తుంపల్లి వాగును అదనపు కలెక్టర్ డేవిడ్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీ మారెట్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక వర్షపు నీరు గంటల తరబడి రోడ్లపైనే నిలిచింది. నాన్‌వెజ్, వెచ్ మార్కెట్ ఏరియా పూర్తిగా జలదిగ్బంధమైంది. వారసంత కావడంతో అదే నీటిలో ప్రజలు అదే నీటిలో వెళ్లి సామగ్రి కొనుగోలు చేస్తూ పంచాయ తీ నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థపై అధికారులు పట్టింపకోకపోవడంతోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. తుంపల్లి గ్రామంలోని పెద్దవాగు ఉధృతితో జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర సమయాల్లో కంట్రోల్ రూం 85008 44365ను సంప్రదించాలని సూచించారు.
చింతలమానేపల్లి, ఆగస్టు 16 : మండలంలోని బాలాజీ అనుకోడకు చెందిన డుబ్బుల బాయక్క, పం గిడి తారక్క-లక్మాజిలకు చెందిన ఇండ్లు కూలిపోయానట్లు స్థానికులు తెలిపారు. నిరుపేద కుటుంబాలు కావడంతో తహసీల్దార్, జిల్లా ఉన్నతాధికారులు స్పందిం చి, పరిహారం అందేలా చూడాలని వేడుకున్నారు.
బెజ్జూర్, ఆగస్టు 16 : బెజ్జూర్-సోమిని మార్గంలోని కుశ్నపల్లి, సుస్మీర్ వాగులు పొంగి ప్రవహించాయి. దీంతో నాలుగు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం వాగుల ప్రవాహాలు తగ్గడంతో రాకపోకలు కొనసాగించారు. యేటా ఆయా మూరుమూల గ్రామాలకు వర్షాకాలం నాలుగు నెలల పాటు ఇదే తంతూ కొనసాగున్నదని వాపోయారు.
పెంచికల్పేట్, ఆగస్టు 16 : పెద్దవాగు, బొకివాగు, ఉచ్చమల్ల వాగులతో పాటు, ఓర్రెలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెంచికల్పేట్-బెజ్జూర్ ప్రధాన రహదారిపై వాగు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు వరద ఉధృతితో రహదారులపై నీరు చేరడంతో కమ్మర్గాం, మురళి గూడ జిల్లెడ, నందిగామ గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. పెద్దవాగు, ఉచ మల్ల వాగు పరీవాహక గ్రామాల్లోని పొలాలు, పంటచేలు నీట మునిగాయి. బొకివాగు ప్రాజెక్ట్ మత్తడి ఉధృతంగా ప్రవహించడంతో గ్రామస్తులు గ్రామం దాటి రాలేని పరిస్థితి నెలకొన్నది. ఎస్ఐ అనిల్ కుమార్ సందర్శించారు. ఎగువన వట్టి వాగు, అడ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
కాగజ్‌నగర్, ఆగస్టు 16 : అందెవెళ్లి, భట్టుపల్లి గ్రా మ ప్రజలు రోడ్డు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ రో డ్డుపై ధర్నా నిర్వహించారు. రోడ్డంతా బురదమయంకావడంతో, నడవలేని దుస్థితి నెలకొన్నదని పేర్కొం టూ రోడ్డుపై అడ్డంగా ముళ్లకంప వేసి, ఆందోళన చేపట్టారు. దాదాపు మూడు గంటలు రాకపోకలు నిలిపివేశారు. రోడ్డు బాగుచేయాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తాత్కాలికంగా మరమ్మతులు చేసి వదిలేస్తున్నారని, దీంతో పరిస్థితి దారుణంగా మారిందన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో రోడ్డుపై ఉ న్న బురద తొలగించి తాత్కాలికంగా చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై ఆర్అండ్బీ డీఈ లక్ష్మీనారాయణను ఫోన్లో సంప్రదించగా, రూ.1.07 కోట్లతో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన పంపినట్లు స్పష్టం చేశారు.
దహెగాం, ఆగస్టు 16 : దహెగాంలో పెసర్‌కుంట, ఐనం, కొంచవెల్లి గ్రామాల్లో పలువురి ఇండ్లలోకి వరద చేరింది. దహెగాం పెద్ద చెరువు మత్తడి దుంకడంతో రావులమల్లన్న వాగులోకి భారీగా నేరు చేరింది. పెద్దవాగు, ఎర్రవాగు పరీవాహక గ్రామాల పంటలు మునిగాయి. ఐనం ఒర్రెతో పాటు, లగ్గాం బద్దోని ఒర్రె పొంగాయి. పెసర్‌కుంట గ్రామాన్ని సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా సందర్శించారు. జాగ్రతలపై తహసీల్దార్ మునవార్ షేరీప్ సూచించారు.
రెబ్బెన, ఆగస్టు 16 : రెబ్బెన మండలంలోని గంగాపూర్, పులికుంట, కొండపల్లి, గుండాల, నంబాల వాగులు పొంగి పొర్లాయి. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలోకి వరద రావడంతో ఇండ్లలోకి నీరు చేరింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు ఎన్టీఆర్ కాలనీలో సహయక చర్యలు చేపట్టారు. గోలేటి రేకులగూడ కాలనీలోని ఇండ్లలోకి వరద చేరింది. రెబ్బెన తహసీల్దార్ సూర్యప్రకాశ్ ప్రజలకు సూచనలు చేశారు.
ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 16 : వర్షాల కారణం గా రవాణా వ్యవస్థకు ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చోట రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. మండలంలోని రాజుర గ్రామానికి వెళ్లే రహదారిపై లో లెవన్ వంతెన ఇరువైపులా కోతకు గురవగా, ఆయన పరిశీలించారు. పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని, అత్యవసరం అయితేనే బయటకురావాలని సూచించారు. ప్రజల తక్షణ సాయం కొరకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్ 85008 44365ను సంప్రదించాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, శిథిలావస్థలో ఉన్న భవనాల్లోని వారిని గుర్తించి, వారికి పునరావాసం ఏర్పాటు చేస్తున్నటుల చెప్పారు. అనంతరం అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి ఆసిఫాబాద్ మం డలం తుంపెల్లి వాగుపై వంతెనను పరిశీలించారు. డీపీవో భిక్షపతి గౌడ్, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, తహసీల్దార్ రియాజ్ అలీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
హాజీపూర్, ఆగస్టు 16 : వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును శనివారం ఆయన సందర్శించారు. 24 గంట ల నుంచి 36 గంటలు భారీ వర్షసూచన ఉన్నదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, ప్రాణ, ఆస్థినష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవల కోసం 08736-250501కు ఫోన్ చేయాలని తెలిపారు. ఆయన వెంట హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రావ్ దేశ్ పాండే, సంబంధిత శాఖల అధికారులున్నారు.
లక్షెట్టిపేట, ఆగస్టు 16 : భారీ నుంచి అతి భారీ వర్షాల సూచన ఉన్నందున ప్రజలకు ఇబ్బందుల్లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 13 వార్డుల్లో పర్యటించి, వర్షపు నీటి స్థితిని, అలాగే కొత్త కొమ్ముగూడెంలోని చెరువును తహసీల్దార్ దిలీప్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. వరద వస్తే ఎదుర్కొనేందుకు 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, జిల్లా అధికారులతో సిద్ధంగా ఉన్నామని, ప్రజల రక్షణకు కావలసిన పరికరాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్ సంపత్తో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి, రిజిస్టర్లు పరిశీలించారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ దవాఖాన సందర్శించి, వార్డు లు, ల్యాబ్, రిజిస్టర్లు, పరిసరాలు పరిశీలించారు.
కోటపల్లి, ఆగస్టు 16 : అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎదుల్లబంధం సమీపంలో కోతకు గురైన రోడ్డును సందర్శించారు. ఈ మార్గంలో భారీ వాహనాలకు అనుమతి ఇవ్వవద్దని అధికారులకు సూచించారు. ఇ సుక బస్తాలతో రోడ్డుకు మరమ్మతులు చేసి, రాకపోకల పునరుద్ధరించాలన్నారు. ప్రాణహిత, గోదావరి ప్రవాహం పెరుగుతున్నందున సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తహసీల్దార్ రాఘవేంద్రరావ్, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సమ్మయ్య ఉన్నారు.