నస్పూర్, మార్చి 15 : మంచిర్యాలలోని శ్రీ చైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సాయిశ్రీవల్లి అంతర్జాతీయ జపాన్ సకురా సైన్స్ సదస్సుకు ఎంపికైందని డీఈవో యాదయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మన దేశం నుంచి సకురాకు 54 మంది విద్యార్థులు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి ముగ్గురు విద్యార్థులున్నారని, ఇందులో శ్రీవల్లి ఉండడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. జూన్ 15 నుంచి 21వ తేదీ వరకు జపాన్ సకురా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. స్త్రీల నెలవారీ రుతుక్రమం ప్రక్రియలో వినియోగిస్తున్న రసాయన శానిటరీ ప్యాడ్ వల్ల కలిగే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపాలని స్త్రీ రుతుమిత్ర కిట్ పరికరాన్ని సాయిశ్రీవల్లి సొంతంగా రూపొందించిందని పేర్కొన్నారు.
ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో నిర్వహించిన 9వ జాతీయ స్థాయి ఇన్స్పైర్ 2020-21 పోటీల్లో పాల్గొని ఉత్తమంగా నిలిచిందని, అలాగే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఇంటర్ పునర్షిప్-2023 కార్యక్రమానికి కూడా ఆహ్వానం అందుకొని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నుంచి ప్రశంసలు అందుకుందని తెలిపారు. సాయి శ్రీవల్లిని డీఈవో యాదయ్య, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, సెక్టోరల్ అధికారులు శ్రీనివాస్, చౌదరి, సత్యనారాయణమూర్తి, యశోదర, చైతన్య పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం అరవింద్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జోబిన్ అభినందించారు.